IND vs SL 2ND T20:  అర్హదీప్ సింగ్... అతి తక్కువ కాలంలోనే టీ20 ఫార్మాట్లో టీమిండియాకు కీలక బౌలర్ గా మారాడు. అరంగేట్రం చేసి 6 నెలలే అవుతున్నా.. తన ఎడమచేతి వాటం బౌలింగ్ తో భారత్ కు ప్రధాన బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ పేసర్ తన బలహీనతను ఒకదాన్ని పోగొట్టుకోలేక సతమవుతున్నాడు. ప్రస్తుతం దానివలనే కోరుకోని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటో తెలుసుకోండి.


ఎంతో ప్రతిభ ఉన్న అర్హదీప్ సింగ్ టీమిండియా తరఫున 6 నెలల క్రితం అరంగేట్రం చేశాడు. మంచి పేస్ బౌలింగ్ తో తక్కువ కాలంలోనే నమ్మదగ్గ బౌలర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే తరచుగా నోబాల్స్ వేసే తన బలహీనతను అతను వదులుకోలేకపోతున్నాడు. ఇప్పుడు దానివలనే ఒక కోరుకోని రికార్డను అర్హదీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లు నోబాల్స్ వేయడం సాధారణం. అయితే అర్హదీప్ 6 నెలల కాలంలోనే టీ20 ఫార్మాట్ లో 14 నోబాల్స్ వేశాడు. పాక్ పేసర్ హసన్ అలీ రికార్డును అతను అధిగమించాడు. అంతేకాదు ఒకే ఓవర్లో హ్యాట్రిక్ నోబాల్స్ వేసిన భారత బౌలర్ గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 


హ్యాట్రిక్ నోబాల్స్


నిన్న జరిగిన భారత్- శ్రీలంక మ్యాచ్ లో అర్హదీప్ 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఆ కోటాలోనే 5 నోబాల్స్ వేశాడు. అందులో 2 బంతులకు శ్రీలంక బ్యాటర్లు 4, 6 బాదారు. అర్హదీప్ మ్యాచ్ లో రెండో ఓవర్ వేశాడు. ఆ ఓవర్లోనే 3 హ్యాట్రిక్ నోబాల్స్ వేశాడు. ఆ ఓవర్ లో 19 పరుగులు ఇచ్చాడు. అర్హదీప్ పేలవ బౌలింగ్ కారణంగా శ్రీలంక తొలి 5 ఓవర్లలోనే 49 పరుగులు చేసింది. ఆ తర్వాత మళ్లీ 19వ ఓవర్ బౌలింగ్ కు వచ్చిన అతను 2 నోబాల్స్ వేశాడు. దీంతో కేవలం 2 ఓవర్లలోనే 37 పరుగులు సమర్పించుకున్నాడు. 


మంచి పేస్, వేగం కలగలిపిన బంతులతో అర్హదీప్ ప్రత్యర్థులను హడలెత్తించగలడు. అలాగే పవర్ ప్లే ఓవర్లలోనూ ప్రభావవంతంగా బౌలింగ్ చేయగలడు. అయితే నోబాల్స్ వేసే తన బలహీనతను అధిగమించకపోతే అది ఈ యువ బౌలర్ కెరీర్ ను ప్రమాదంలో పడేసే అవకాశాలు లేకపోలేదు. ప్రతి పరుగు ఎంతో విలువైన టీ20 క్రికెట్ లో ఒక్క నోబాల్ మ్యాచ్ గతినే మార్చేయగలదు. కాబట్టి అర్హదీప్ తన బలహీనతను ఎంత త్వరగా అధిగమిస్తే అంత బాగా రాణించగలడు.