AP CM Jagan: పేద, మధ్య తరగతి విద్యార్థులకు అత్యుత్తమైమన విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ సీఎం జగన్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. విద్యా బోధనలో ఎక్కడ నాణ్యత లోపించినా సహించేది లేదని జగనన్న విద్యా కానుక సమీక్షా సమావేశంలో తెలిపారు. అలాగే ప్రతీ సర్కారు బడిలో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఉండేలా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉంటేనే బోధనలో నాణ్యత పెరుగుతుందని, విద్యార్థుల అభ్యాసం కూడా మెరుగవుతుందన్నారు. నాడు - నేడు కింద జరుగుతున్న రెండో దళ పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 22 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 15 వందల కోట్ల రూపాయల పనులు నడుస్తున్నాయని స్పష్టం చేశారు.


ఇటీవలే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వాటి వాడకం, టీచింగ్ పై నిరంతర పరిశీలన ఉండాలని ఏపీ సీఎం జగన్ అధికారులకు తెలిపారు. విద్యార్థులు పాఠఆలు నేర్చుకుంటున్న తీరు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా చెక్ చేయాలని అన్నారు. ట్యాబ్ ల మెయింటనెన్స్ కోసం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వీస్ సెంటర్ ఏర్పాటు అవుతుందన్నారు. ట్యాబ్ లో సమస్య ఉంటే వారం రోజుల్లో రిపేర్ చేసి ఇవ్వాలని.. అలా కుదరని పక్షంలో కొత్త ట్యాబ్ ఇవ్వాలని సూచించారు. అంతేకాకుండా ప్రతీ ఒక్క విద్యార్థి దగ్గర డిక్షనరీ ఉందో లేదో మరోసారి చెక్ చేయాలని అన్నారు. లేని వాల్లకు కొత్త డిక్షనరీని వెంటనే అందించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యా కానుక కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన రోజు నుంచి వాటిని అందించి తీరాలని స్పష్టం చేశారు. తరగతి గదులు, క్లాస్ రూమ్స్ డిజిటలైజేషన్ వేగంగా పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. డిజిటల్ స్క్రీన్స్ కోసం ఐఎఫ్సీ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. డిజిటల్ స్క్రీన్స్ తో విద్యార్థులకు అత్యుత్తమ విద్యాబోధన అందుతుందన్నారు.  


ఇటీవలే ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇచ్చిన ప్రభుత్వం


ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామని గతంలోనే ప్రకటించిన ప్రభుత్వం... వారితోపాటుగా ఉపాధ్యాయులకూ ట్యాబ్‌లు అందించింది. పాఠాలు చెప్పేందుకు వీలుగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ట్యాబ్‌లు అందించారు. ప్రభుత్వం రూ.686 కోట్లతో ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు ఇచ్చారు. రాష్ట్రంలోని 9,703  పాఠశాలల్లోని 4.50 లక్షల మంది విద్యార్థులు, 50,194 మంది ఉపాధ్యాయులు బైజూస్ నుండి కంటెంట్‌తో లోడ్ చేసిన Samsung T220 Lite Tablet PCని పొందారు.  ఈ ట్యాబ్‌ల వల్ల విద్యార్థులు నిరంతరం తమ సందేహాలను తీర్చుకునే అవకాశం ఉంటుంది. క్లాస్ రూమ్‌లలోనే కాకుండా ఇంటి దగ్గర కూడా బైజూస్ కంటెంట్ ద్వారా చదువుకునే వెసులు బాటు ఉంటుంది. ముఖ్యంగా పేద విద్యార్థులు ఇతరులతో పోటీ పడేందుకు ఈ ట్యాబ్‌లు ఎంతగానే ఉపయోగపడనున్నాయి.