Valmiki Temple Pakistan: 


20 ఏళ్ల తరవాత హిందువుల పూజా కార్యక్రమాలు 


పాకిస్థాన్‌లోని లాహోర్‌లో 1200 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించేందుకు లైన్ క్లియర్ అయింది. ఆక్రమణలకు గురైన ఈ ఆలయ పునురద్ధరణపై ఎన్నో ఏళ్లుగా కోర్టులో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. మైనార్టీ వర్గాల పుణ్యక్షేత్రాలను పరిరక్షించే అధికార సంస్థ ఈ విషయం వెల్లడించింది. లాహోర్‌లోని అనార్కలీ బజార్‌లో ఉన్న వాల్మీకి మందిర్‌ను గత నెల ఓ క్రిస్టియన్ కుటుంబం నుంచి ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (EPTB)స్వాధీనం చేసుకుంది. లాహోర్‌లో ఉన్న కృష్ణ టెంపుల్‌ పక్కనే ఈ వాల్మీకి టెంపుల్‌ కూడా ఉంది. అయితే...ఆ క్రిస్టియన్ కుటుంబం హిందూ మతంలోకి మారిపోయింది. వాల్మీకి మందిర్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకుని..కేవలం వాల్మీకి కులానికి చెందిన వాళ్లు మాత్రమే అక్కడ పూజలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. దాదాపు రెండు దశాబ్దాలుగా అక్కడ అదే జరుగుతోంది. వాదోపవాదాలు విన్న తరవాత EPTB ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకుని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. "మాస్టర్ ప్లాన్‌"కు అనుగుణంగా మరి కొద్ది రోజుల్లోనే ఈ పనులు మొదలవుతాయని చెప్పింది. ఈ ఆలయాన్ని స్వాధీనంచేసుకున్న వెంటనే దాదాపు 100 మంది హిందువులు, సిక్కులు, కొందరు క్రిస్టియన్లు వాల్మీకి టెంపుల్‌కు వచ్చారని, హిందువులు అక్కడ తమ ఆచారాల ప్రకారం పూజలు కూడా చేశారని వెల్లడించారు. దాదాపు 20 ఏళ్ల తరవాత ఇలా అందరూ ఈ ఆలయంలో కలిసి భోజనం చేశారని తెలిపారు EPTB ప్రతినిధులు. 


చాన్నాళ్లుగా కోర్టులో నలుగుతున్న వివాదం..


నిజానికి రెవెన్యూ రికార్డ్‌లో ఈ ఆలయ భూమి EPTB పేరునే రిజిస్టర్ అయినప్పటికీ...ఆ కుటుంబం మాత్రం అది పూర్తిగా తమకే సొంతం అని 2010లో కోర్టులో కేసు వేసింది. అది కేవలం వాల్మీకీల కోసమే కట్టించిన ఆలయమని గట్టిగా వాదించింది. అప్పటి నుంచి ఈ వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తి సాక్ష్యాధారాలు పరిశీలించిన తరవాత కోర్టు "పిటిషనర్‌ సమర్పించిన ఆధారాల్లో నిజం లేదు" అని వెల్లడించినట్టు EPTB ప్రతినిధులు స్పష్టం చేశారు. 1992లో భారత్‌లో బాబ్రీ మసీదు ధ్వంసం చేయటంపై పాకిస్థాన్‌లో ఆగ్రహం వ్యక్తమైంది. ఆ సమయంలో కొందరు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. కృష్ణుడు, వాల్మీకి విగ్రహాలను కూల్చి వేశారు. అక్కడి పాత్రల్ని నాశనం చేశారు. విగ్రహాలపై ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆలయానికి నిప్పు కూడా పెట్టారు. చాలా రోజుల పాటు శ్రమించి ఈ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు అక్కడి అధికారులు. ఈ వివాదాల నేపథ్యంలోనే పాక్ సుప్రీం కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.హిందువులు పూజా కార్యక్రమాలు కొనసాగించే విధంగా ఆలయాన్ని పునరుద్ధరించాలని తేల్చి చెప్పింది. ల్యాండ్‌ లిటిగేషన్ల కారణంగా ఇన్నాళ్లు ఇది జరగలేదు. ఇన్నాళ్లకు ఇందుకు మార్గం సుగమమైంది. ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (EPTB) పాక్‌లోని 200 గురుద్వార్‌లను, 150 ఆలయాలను సంరక్షిస్తోంది. 


Also Read: Rambha Latest Look : రంభ ఇంట్లో ఖుష్బూ - అప్పటి స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి


Also Read: Babul Supriyo: భాజపా చేతిలో బలిపశువు అవ్వనందుకు హ్యాపీ - బాబుల్‌ సుప్రియో హాట్ కామెంట్స్