టీ ప్రియులు అనే కన్నా కొందరిని టీ బానిసలు అనవచ్చు... ఎందుకో తెలుసా? ఆ రోజు ఉదయం టీ తాగనిదే వారు ఏ పనీ చేయలేరు. ‘తలనొప్పి వచ్చేస్తోంది, ఏదో అయిపోతోంది... టీ తాగలేదు’ అంటూ చాలా బాధపడిపోతుంటారు. టీ తాగడం మంచిదే కానీ, చాలా మంది తాగే పద్ధతి మాత్రం శరీరానికి హాని కలిగించేదే. ఆరోగ్యనిపుణుల అభిప్రాయం ప్రకారం ఎనిమిదిగంటల పాటూ నిద్రపోయిన తరువాత ఖాళీ పొట్టతో టీ తాగడం వల్ల శరీరం అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది. ఉదయం లేవగానే మొదటి ద్రవపదార్థంగా టీ తాగడం వల్ల జీర్ణ క్రియపై చెడు ప్రభావం చూపనప్పటికీ, అతిగా మూత్ర విసర్జనకు కారణం అవుతుంది. దీని వల్ల శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. అంతేకాకుండా పొట్టలోని మంచి బ్యాక్టిరియాను కూడా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల పొట్ట ఉబ్బరం, అజీర్తి సమస్యలు కలిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో తలనొప్పి తరచూ రావడానికి కారణం అవుతుంది. అలాగే టీలో ఉండే టానిన్లు ఆహారం నుంచి ఇనుము వంటి పోషకాలు శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది. 


పరగడుపున వద్దు
టీ తాగొద్దని మేం చెప్పడం లేదు, కానీ ఖాళీ పొట్టతో పరగడుపున తాగవద్దని మాత్రమే సూచిస్తున్నాం. ఒక కప్పు టీతో మీ రోజును ప్రారంభించడం వల్ల పొట్టలో ఆమ్లాలు ఏర్పడతాయి. జీర్ణ వ్యవస్థలో అసౌకర్యంగా అనిపిస్తుంది. మీరు టీ తాగకుండా ఉండలేని వారైతే రోజూ ఉదయం పరగడుపున కాకుండా టైమింగ్స్ మార్చుకోండి. ఉదయాన లేచిన వెంటనే గ్లాసు నీళ్లు మొదట తాగండి. తరువాత బాదం వంటి పప్పును రాత్రిపూటే నానబెట్టుకుని ఉదయం తినండి. వాటి వల్ల శరీరానికి కొన్ని పోషకాలు అందుతాయి. ఆ తరువాత టీ తాగండి. టీలో చక్కెరను వాడవద్దు. తేనె లేదా బెల్లాన్ని వేసుకోవడం ఉత్తమం. అప్పటికే పొట్టలో నీళ్లు, నట్స్ ఉంటాయి కాబట్టి వాటి పోషకాలను శరీరం గ్రహిస్తుంది కాబట్టి, టీ తాగినా కూడా ఎలాంటి సమస్యా రాదు. 


తాగడం ఆపవద్దు
టీ తాగడం మాత్రం ఆపేయకండి. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. అనేక రకాల అలెర్జీలకు ఇది చెక్ పెడుతుంది.చర్మ సంబంధ వ్యాధులను కూడా అడ్డుకుంటుంది. టీలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో గ్రీన్ టీ ఎంతో ఆరోగ్యకరమైనది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో కొవ్వు చేరకుండా కాపాడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. 


Also read: రోజూ బ్రెడ్ తినడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వస్తుందా?



Also read: 27 గంటల పాటూ 100 మంది వైద్యుల కష్టం, అవిభక్త కవలలకు పునర్జన్మ - ఉపయోగపడిన వర్చువల్ రియాల్టీ టెక్నాలజీ


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.