వీణావాణీలలాగే తలలు కలిసి జన్మించారు ఇద్దరు అన్నదమ్ములు. వారిది బ్రెజిల్. వయసు మూడేళ్లు. వారిద్దరినీ విడదీసేందుకు ఎంతో కష్టపడ్డారు వైద్యులు. దాదాపు వివిధ దేశాల్లోని వందమంది వైద్యులు వర్చువల్ పద్ధతిలో కలిసి ఆపరేషన్ మొత్తాన్ని పూర్తిచేశారు. బ్రెజిల్ లోని రియో డి జనరేరియోలోని ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. నేరుగా శస్త్రచికిత్స చేస్తున్న వైద్యులతో లండన్,ఇతర దేశాల్లోని వైద్యులు వర్చువల్ పద్ధతిలో కలిశారు. లండన్ వైద్యుల వర్చువల్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ సాగింది. ఈ శస్త్రచికిత్స చేసినంత కాలం వైద్యులు చెవులకు హెడ్ సెట్ పెట్టుకునే ఉన్నారు. దాదాపు 27 గంటల పాటూ ఆపరేషన్ సాగింది.
కష్టానికి ఫలితం
ఆ ఇద్దరి కవల అన్నదమ్ముల పేర్లు బెర్నార్డో, ఆర్ధర్ లీమా. తల, తలలోని మెదడు కూడా కలిసిపోయి పుట్టారు వీరిద్దరూ. ఓ స్వచ్ఛందసంస్థ సాయంతో వీరిద్దరినీ విడదీసేందుకు ముందుకు వచ్చారు బ్రెజిల్ వైద్యులు. 27 గంటలపాటూ సాగిన శస్త్ర చికిత్సలో వైద్యులు కేవలం ఆహారం తినేందుకు పావు గంటసేపు మాత్రమే బ్రేక్ తీసుకునేవారు. శస్త్రచికిత్స చేస్తున్నంత కాలం పిల్లల రక్తపోటు, గుండె కొట్టుకునే వేగాన్ని పరిశీలిస్తునే ఉన్నారు. ఆ రెండూ చాలా పెరిగిపోవడం వీరిని కలవరానికి గురి చేసింది. అయినా పిల్లలకు విజయవంతంగా సర్జరీని పూర్తి చేశారు. నాలుగు రోజుల పాటూ వారిద్దరినీ దూరంగా ఉంచి వైద్యం అందించారు. తరువాత ఇద్దరినీ ఒకే బెడ్ పై ఉంచి వారి శరీరాలు తాకేలా చేశారు. అలా చేయగానే రక్తపోటు సాధారణ స్థాయికి వచ్చేసింది. ఎంతో కష్టపడిన వైద్యులు పిల్లల కుటుంబాల్లో ఆనందాన్ని చూసి తమ కష్టాన్ని మరిచిపోయారు.
ఆసుపత్రిలోనే...
వీరిని వెంటనే డిశ్చార్జి చేయరు. కొన్ని నెలల పాటూ ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుంది. అందుకు తగ్గ పునరావాసాన్ని ఏర్పాటు చేస్తోంది ఆసుపత్రి యాజమాన్యం. వారు సాధారణ పిల్లల్లా జీవించగలరనే నమ్మకం వచ్చాకే వారిని ఇంటికి పంపిస్తారు.
ఓ సర్వే ప్రకారం ప్రపంచంలో 60,000 జననాల్లో కేవలం ఒకరు మాత్రమే ఇలాంటి కవలలు పుడతారు. వారిలో కూడా అయిదు శాతం మందిలో మాత్రమే తలలు కలిసి పుట్టడం జరుగుతోంది. ఇలా తలలు కలిసి పుట్టే పిల్లల్ని క్రానియోపాగస్ అంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 50 కవలలు ఇలా పుడుతున్నట్టు అంచనా. వారిలో 15 మంది మాత్రమే జీవించి ఉంటున్నట్టు తెలుస్తోంది.
Also read: ఏడాదికి రూ.61 లక్షల జీతాన్నిచ్చే ఉద్యోగం, అయిదేళ్ల వయసు దాటిన ఎవరైనా అప్లయ్ చేయచ్చు
Also read: ఆవు పాలకన్నా గేదెపాలలోనే పోషకాలు ఎక్కువ, వాటిని తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో