ఆవు పాలు, గేదె పాలు... ఈ రెండింట్లో ఏ పాలు మంచివన్న విషయంలో చాలా అభిప్రాయబేధాలు ఉంటాయి. నిజానికి రెండూ మంచివే. అయితే మనకు విరివిగా దొరికేవి మాత్రం గేదెపాలు. వీటి వల్ల చాలా ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ఆవు పాల కన్నా గేదెపాలు ధర కూడా తక్కువే కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటాయి. వీటిలో దొరికే ఆరోగ్యప్రయోజనాలు కూడా అధికమే. 


గేదెపాలలో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇది ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. తీవ్ర అనారోగ్యాలకు కారణమయ్యే టాక్సిన్లను యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిస్తాయి. విటమిన్ సి తెల్ల రక్తకణాలను ఉత్తేజపరిచి, రోగనిరోధక వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తుంది. 


రక్తప్రసరణలో మెరుగుదల
గేదేపాలలో ఇనుము అధికంగా ఉంటుంది. ఎర్రరక్త కణాల్లో హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది. గేదె పాలలో ఉండే ఇనుము ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. ఈ కణాలు ప్రతి అవయవానికి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి. అలాగే కొత్త కణాల పెరుగుదలకు సహాయపడతాయి. 


గుండెకు మేలు
ఆవుపాలతో పోలిస్తే గేదుపాలలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. కాబట్టి గుండె సంబంధ వ్యాధులు, స్ట్రోకులు, గుండె పోటు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఈ పాలను రోజుకో గ్లాసు తాగితే గుండె సంబంధ వ్యాధులు దూరమవుతాయి. 


ప్రొటీన్ శరీర సౌష్టవతకు అవసరం. ఇది గేదెపాలలో అధికంగా ఉంటుంది. కండరాలు, ఎముకల పెరుగుదలను ప్రొటీన్లు మెరుగుపరుస్తాయి. శరీరంలోని కణాలను రిపేర్ చేయాలన్న, కొత్తగా నిర్మించాలన్నా ప్రొటీన్‌ చాలా అవసరం. అలాగే అధిక రక్తపోటు కలవారికి గేదె పాలే ముఖ్యం. ఇందులో పొటాషియం కంటెంట్ రక్తపోటును సమతుల్యం చేస్తుంది. రక్తనాళాలు, ధమనులపై ఒత్తిడిని తగ్గిస్తుంది. కరోనరీ సమస్యలను కూడా అడ్డుకుంటుంది. 


ఎముకలకు బలం
గేదె పాలలో ఉండే కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. ఫాస్పరస్, కాపర్, మాంగనీస్, జింక్ వంటి ఇతర ముఖ్య ఖనిజాలు కూడా ఇందులో ఉంటాయి. ఇవన్నీ ఆర్ధరైటిస్ రాకుండా అడ్డుకుంటాయి. ఆవు పాల కన్నా గేదెపాలలోనే కాల్షియం అధికంగా ఉంటుంది. అందుకే పిల్లలకు గేదెపాలు తాగించడం చాలా ఉత్తమం. 


Also read: చిన్న బెల్లం ముక్కతో వేయించిన శెనగలు తింటే ఎన్ని లాభాలో, ఆ సమస్యలన్నీ దూరం


Also read: మీ డైట్‌లో ఈ ఆరు సూపర్ ఫుడ్స్ చేర్చుకుంటే ఆరోగ్యానికి తిరుగే ఉండదు





























































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.