చాక్లెట లవర్స్‌ కోసమే ఓ ఉద్యోగం. నచ్చినన్ని చాక్లెట్లు, క్యాండీలు తినవచ్చు ఈ జాబ్ చేస్తే. అందుకే దీన్ని తీయని ఉద్యోగం అని పిలుచుకోవచ్చు. ఇంతకీ ఆ ఉద్యోగం పేరేంటో చెప్పలేదు కదా... ‘చీఫ్ క్యాండీ ఆఫీసర్’. అయిదేళ్ల వయసు నిండిన ఎవరైనా అప్లయ్ చేసుకోవచ్చు. అర్హత మాత్రం ఒక్కటే... మీకు క్యాండీలంటే బాగా ఇష్టం ఉండాలి. కెనడాలో ఇప్పుడు ఈ ఉద్యోగ ప్రకటన వైరల్ గా మారింది. చిన్న పిల్లలు సైతం దరఖాస్తులు నింపి పంపిస్తున్నారు. 


కెనడాకు చెందిన చాక్లెట్ల కంపెనీ ‘క్యాండీ ఫన్‌హౌస్’. వారు తమ ట్విట్టర్ ఖాతాలో ఈ ఉద్యోగం తాలుకూ వివరాలను పోస్టు చేశారు. అంతేకాదు ఉద్యోగ ప్రకటన వెబ్‌సైట్ లింక్డిన్‌లో ఈ ఉద్యోగం తాలూకు వివరాలు ప్రచురించారు. జీతాన్ని లక్ష డాలర్లుగా ప్రకటించారు. అంటే మన రూపాయల్లో 61 లక్షల రూపాయలు. అందులోనూ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం. అందుకే పిల్లలకు కూడా అప్లయ్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. వీరు చేయాల్సిందిల్లా క్యాండీ టేస్టు చేసి ఎలా ఉందో చెప్పాలి. అందుకే క్యాండీ టెస్టర్ అని కూడా పిలుచుకోవచ్చు. 


వేల కొద్దీ అప్లికేషన్లు రావడంతో ఆ సంస్థ సీఈవో ఉబ్బితబ్బిబవుతున్నారు. అంతేకాదు రోజు 117 క్యాండీలు దాకా వారు తినాల్సి వస్తుందని చెబుతున్నారు. అన్నేసి క్యాండీలు రోజూ తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని,అది మంచి పద్ధతి కాదని చాలా మంది ఆ ఉద్యోగానికి అప్లయ్ చేయలేదు. అందుకే ఈ ఉద్యోగానికి మధుమేహం ఉన్న వారు అనర్హులు. ఈ ఉద్యోగంలో చేరితే ఎవరికైనా కొన్ని రోజుల్లోనే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. రోజుకో చాక్లెట్ తింటేనే సమస్యలు మొదలవుతాయని, ఇక 117 తింటే వారు ఏమవుతారని వాదిస్తున్నారు. ఇలాంటి ఉద్యోగాలు ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయని సూచిస్తున్నారు.