Pakistan Economic Crisis:
75 ఏళ్లుగా డబ్బులు అర్థిస్తూనే ఉన్నాం: షెహబాజ్
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మొన్నటి వరకూ రాజకీయ స్థిరత్వం లేక ఆర్థికంగా నష్టపోయిన ఆ దేశం..ఇటీవల వచ్చిన వరదలతో ఇంకా కుంగిపోయింది. ఆర్థిక సాయం కోసం చేతులు చాచాల్సిన దుస్థితిలో ఉంది. ఈ క్రమంలోనే ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అసహనం వ్యక్తం చేశారు. "మిత్ర దేశాలు కూడా మమ్మల్ని బిచ్చగాళ్లలా చూస్తున్నాయి. ఎప్పుడూ డబ్బులు అర్థించే దేశంగానే పాక్‌ను చూస్తున్నాయి" అని అన్నారు. ఓ మీటింగ్‌కు హాజరైన ఆయన...ఇలా తన అసంతృప్తిని బయటపెట్టారు. "పాక్ తరపున ఎవరైనా ఏదైనా దేశానికి వెళ్లినా, లేదంటే ఫోన్ కాల్ చేసినా మేము కేవలం డబ్బులు అడుక్కోటానికి మాత్రమే సంప్రదిస్తున్నాం అని అనుకుంటున్నారు" అని వ్యాఖ్యానించారు. "ఈ 75 ఏళ్లలో మనం ఏం సాధించాం..? పాకిస్థాన్ కన్నా చిన్న దేశాలు ఆర్థికంగా ఎప్పుడో మనల్ని అధిగమించాయి. మనం మాత్రం 75 ఏళ్లుగా డబ్బుల కోసం అర్థిస్తూనే ఉన్నాం" అని అన్నారు షెహబాజ్. దేశంలో ద్రవ్యోల్బణం పెరగటానికి గత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కారణమని...విమర్శించారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF)తో చేసుకున్న ఒప్పందాన్ని కాదని గత ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని, నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపించారు. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోతే...ఒప్పందం రద్దు చేసుకుంటామని IMF హెచ్చరించినా.. ఇమ్రాన్ సర్కార్ మాట వినలేదని మండి పడ్డారు. సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక ఎంతో కొంత దేశ ఆర్థిక పరిస్థితులు బాగు పడ్డాయని అన్నారు షెహబాజ్.
వరదలతో జీడీపీ డౌన్..
పాకిస్థాన్‌లో వరదలు ఎంత బీభత్సం సృష్టించాయో కళ్లారా చూశాం. మూడొంతుల దేశం నీట మునిగింది. ఆహారం లేక ప్రజలు అలమటిస్తున్నారు. లక్షలాది మూగ జీవాలు నీళ్లలో పడి కొట్టుకుపోయాయి. వేల కిలోమీటర్ల రహదారులు ధ్వంసమయ్యాయి. ఇళ్లు కూడా కూలిపోయాయి. వీటికి తోడు ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో పాకిస్థాన్ ఆదాయం పడిపోతుందని అంచనా వేస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి పాకిస్థాన్ GDP వృద్ధి రేటు 5 నుంచి 3 %కి పడిపోతుందని కొన్ని రిపోర్ట్‌లు వెల్లడించాయి. National Flood Response and Coordination Centre (NFRCC)ఛైర్మన్, మేజర్ జనరల్ జఫర్ ఇక్బాల్, ప్రధాని షెహబాజ్ షరీఫ్...ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ఆంటోనియో గుటెర్రస్‌తో మాట్లాడారు. పాక్‌లోని ప్రస్తుత పరిస్థితులను ఆయనకు వివరించారు. మూడొంతుల దేశం ధ్వంసమైందని...ఈ విపత్తు వల్ల కలిగిన నష్టం దాదాపు 30 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని చెప్పారు. వరుస సంక్షోభాలు, వరదలు, IMF నిధుల రాకలో జాప్యం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం...అన్నీ కలిసి జీడీపీలో 2% మేర కోత పడొచ్చని అక్కడి సంస్థలు కూడా అంచనా వేస్తున్నాయి. 2010లో వచ్చిన వరదలు దాదాపు 2 కోట్ల మందిపై ప్రభావం చూపితే...ఈ సారి దాదాపు 3కోట్ల మందికి పైగా ప్రభావానికి గురయ్యారు. వీరిలో దాదాపు 60 లక్షల మంది నిరాశ్రయు లయ్యారు. ఈ విపత్తుని ఎదుర్కొనేందుకు అవసరమైన మౌలిక వసతులు లేకపోవటం ప్రధాన సమస్యగా మారింది. సహాయక చర్యలు చేసేందుకు మిలిటరీ, ఎన్‌జీవోలు రంగంలోకి దిగాయి. అటు ఐక్యరాజ్య సమితి సహాయక బృందాలు కూడా తమ విధులు నిర్వర్తిస్తున్నాయి.
Also Read: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ - హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు