దేవి కరాటేలో గెలిచినందుకు అందరూ సంతోషంగా ఉంటారు. నువ్వు గెలుస్తావని నాకు తెలుసు తల్లి ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కదా అని మాధవ్ అనేసరికి రుక్మిణి కోపంగా చూస్తుంది. దేవుడమ్మ సత్య చీరలు అన్నీ తీస్తుంది. ఎందుకు ఆంటీ నా చీరలు అన్నీ తీసి బయటపడేస్తున్నారని సత్య అడుగుతుంది. మంచి చీరలు కట్టుకుని చక్కగా ఉండు అంటే అసలు పట్టించుకోవెంటీ సత్య అని దేవుడమ్మ కోపంగా అంటుంది. నా గురించి పట్టించుకోవాల్సిన ఆదిత్య పట్టించుకోనప్పుడు నేనేమీ చెయ్యాలి అని బాధగా అంటుంది. అలా దూరంగా ఉంటే మరింత దూరం అయిపోతావ్, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అలకలు ఉంటాయి వాటిని వదిలేసి మరింత దగ్గర అవాలి అని సత్యకి అర్థం అయ్యేలాగా చెప్తుంది. మంచి చీర కట్టుకుని సంతోషంగా వాడి దగ్గరకి వెళ్ళు అని దేవుడమ్మ చెప్తుంది.


దేవిని చిన్మయి రెడీ చేస్తూ ఉంటుంది. అది చూసి రుక్మిణి అవ్వ దగ్గరకి వెళ్ళడానికి నువ్వు తయారు చెయ్యడం ఏంటి అని అడుగుతుంది. అక్కడికే కదా వెళ్లాల్సింది అని చిన్మయి అంటుంది. అదేంటక్కా అలా అంటున్నావ్ ఆఫీసర్ సార్ ఇంటికి నేను ఎప్పుడైనా పోతా ఊరికే ఎందుకు వెళ్తాను అని దేవి ఏమి అర్థం కానట్టు అడుగుతుంది. లేదు దేవి ఆ ఇల్లు కూడా మన ఇల్లే. వాళ్ళు మన వాళ్ళే మనకి సంతోషం వచ్చినా, బాధ వచ్చినా వాళ్ళకి కూడా చెప్పాలి అని చిన్మయి బాధగా అంటుంది. కొత్తగా మాట్లాడుతున్నావ్ ఏంటి అని దేవి అడుగుతుంది. వాళ్ళందరికీ నువ్వంటే చాలా ఇష్టం.. నిజానికి నువ్వు అక్కడే ఉండాలి అని చిన్మయి అనేసరికి అదేంటి అలా అంటున్నావ్ అని దేవి అంటుంది. అదే వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటున్నారు కదా అని కవర్ చేస్తుంది.


Also Read: వేదని వదిలి మాళవిక చెయ్యి అందుకున్న యష్- జలస్ ఫీల్ అయిన అభిమన్యు


మాధవ్ వచ్చి ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు. దేవిని ఆఫీసర్ సార్ ఇంటికి పంపిస్తున్నా అని చెప్తుంది. వాళ్ళింటికి నువ్వు పంపించడం ఏంటి, దేవి గెలిస్తే మనం ఆనందించాలి కానీ వాళ్ళకి ఎందుకు అని అంటాడు. దేవి ఇక్కడే కాదు అక్కడ కూడా ఉండాలి.. దేవి అంటే ఆఫీసర్ సార్ కి చాలా ఇష్టం వాళ్ళు కూడా దేవి గెలిచిందంటే చాలా సంతోషిస్తారు అని చిన్మయి చెప్తుంది. ఈ విషయంలో నీకు ఏమి తెలియదు నువ్వు మాట్లాడకు అని అంటుంది. చిన్మయి ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది దేవి నా బిడ్డ కాదని చిన్మయికి తెలిసిపోయిందా ఏంటి అని మాధవ్ ఆలోచిస్తాడు. జానకి రామూర్తి దగ్గరకి వచ్చి మాధవ్ పద్ధతి మారిందని అంటాడు. మీరు ఒకసారి గట్టిగా మందలించాలి అని జానకి చెప్తుంది. రాధాని ఇష్టపడ్డాడు తను కాదు అనేసరికి వాడు మౌనంగా ఉంటున్నాడని రామూర్తి అంటాడు. కాదు వాడు మౌనంగా లేడని చెప్తుంది. వాడిని అనుమానిస్తే మన పెంపకాన్ని మనమే అనుమానించినట్టు అని రామూర్తి సర్ది చెప్తాడు.


సత్య అందంగా రెడీ అయి ఆదిత్యతో కలిసి బయటకి వెళ్లేందుకు వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు బయటకి వెళ్ళే టైమ్ కి దేవి ఇంటికి వస్తుంది. ఫోన్ చేస్తే నేనే వచ్చే వాడిని కదా అని ఆదిత్య అంటే మీకోక విషయం చెప్పాలి అందుకే వచ్చాను అని దేవి అంటుంది. కరాటేలో గ్రీన్ బెల్ట్ వచ్చిందని చెప్తుంది. దేవి గెలిచిందనే సంతోషంలో ఆదిత్య సత్యని వదిలేసి చాక్లెట్స్, కేక్ తీసుకొస్తాను అని బయటకి వెళ్లిపోవడంతో సత్య షాక్ అవుతుంది. ఏంటి ఆదిత్య ఇలా అయిపోతున్నాడు మేము బయటకి వెళ్తున్నాం అనే విషయం మర్చిపోయి ఇలా వెళ్ళిపోయాడు ఏంటి అని అనుకుంటుంది.


Also Read: 'నీ తమాషా ఇంటి దగ్గర పెట్టుకో' అని లాస్యని వాయించేసిన సామ్రాట్- లాస్యకి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన తులసి


రాధ తన గదిలో బట్టలు మడత పెట్టుకుంటూ ఉంటే మాధవ్ చాటుగా వచ్చి ఫోటోస్ తీస్తూ ఉంటాడు. జానకి వచ్చి మాధవ్ చెయ్యి పట్టుకుని పక్కకి లాగేస్తుంది. ఫోన్ తీసుకుని అందులో ఉన్న ఫోటోస్ చూసి షాక్ అవుతుంది. ఏం పాడు పనులు రా ఇవి అని లాగి పెట్టి చెంప చెల్లుమననిపిస్తుంది. రాధాని ఇలా చాటుగా ఫోటోస్ తియ్యడం ఏంటి నీ మనసులో ఆలోచనలు ఏంటో నాకు అర్థం కావడం లేదు. రాధాని ఇలాంటి దృష్టిలో చూడటానికి నీకు మనసు ఎలా వచ్చింది అని కోపంగా నిలదిస్తుంది. నేను మామూలుగా ఫోటోస్ తీస్తున్నా అని కవర్ చేసేందుకు చూస్తాడు కానీ జానకి మాత్రం ఇవి మామూలు ఫోటోస్ అని ఎవరైనా అనుకుంటారా? మాధవ్ నీ పద్ధతి మారుతుంది, ఆ అమ్మాయి లేకపోతే నువ్వు కానీ నీ బిడ్డ కానీ లేరు. తన మెడలో తాళి కట్టిన వాడు లేకపోయినా నిప్పులా బతుకుతుంది. ఇంకోసారి ఇలాంటి తప్పు చేశావా కొడుకువి అని కూడా చూడను అని వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఎన్ని చెప్పినా సరే రాధ ఎప్పటికీ నాదే అని ఆ విషయంలో నేను ఎవరి మాట వినను అని మాధవ్ అంటాడు.