ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న దాడులు
ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
హైదరాబాద్, నెల్లూరులో పలు చోట్ల ఈడీ సోదాలు
ఆయా రాష్ట్రాల్లో 40కి పైగా ప్రదేశాల్లో సోదాలు చేస్తున్నట్లు వెల్లడి


దేశ వ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టింది ఈడీ. హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో హైదరాబాద్‌లో, ఏపీలో నెల్లూరు జిల్లాలో ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. 
దేశ వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు
ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 40 చోట్ల ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, నెల్లూరులో 25 బృందాలుగా ఏర్పడి తనిఖీలు జరుగుతున్నాయి. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు సార్లు తనిఖీలు నిర్వహించారు. తాజాగా హైదరాబాద్‌ లో నానక్‌రామ్ గూడ, కోకాపేట, రాయదుర్గం, జూబ్లిహిల్స్, సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.


రాబిన్ డిస్టల‌రీస్ , రాబిన్ డిస్ట్రిబ్యూష‌న్స్ కంపెనీలపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఉన్నాయి. ఈ కంపెనీలో రామ‌చంద్ర పిళ్లై, గండ్ర ప్రేమ్ సాగ‌ర్ రావు, బోయినప‌ల్లి అవినాష్ రావు, సూదిని సృజ‌న్ రెడ్డిల‌ు భాగ‌స్వామిగా ఉన్నారు. ఈ దాడుల‌తో ఢిల్లీ లిక్కర్ స్కాం తెర వెన‌క ఎవరున్నార‌ని వివరాలు రాబ‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌కు అత్యంత సన్నిహితుడైన అవినాష్ రావు పై ఆరోపణలు రావడం ఇటీవల చర్చనీయాంశమైంది. గండ్ర ప్రేమ్ సాగ‌ర్ రావు ఇటీవ‌ల కాలంలో విదేశాల నుంచి వ్యాపారం మొద‌లు పెట్టారు. అత‌నికి ఆర్ధిక స‌హాయం చేసింది ఎవరు. ఆ లాభాల నుంచి ల‌బ్దిపొందింది ఎవ‌ర‌నేది తేల్చే పనిలో  ఈడీ బిజీగా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు రావడంతో.. ఆమెకు సంబంధించిన ఆస్తులపై సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.