Telangana Vimochana Dinam : సెప్టెంబర్ 17, 1948న తెలంగాణ చరిత్రలో ఓ కీలక అధ్యాయం మొదలైంది. దేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న వచ్చినా.. తెలంగాణ ప్రజలు మాత్రం మరుసటి ఏడాది వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఆపరేషన్ పోలో ద్వారా అప్పటి భారత హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పటి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్ లో విలీనం చేసి సక్సెస్ సాధించారు. చివరి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పటి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్‌లో కలిపేందుకు అంగీకరించిన కీలక ఘట్టానికి జగిత్యాలకు చెందిన మహ్మద్ ఉస్మానొద్దీన్ ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. 
నిజాం దూత జగిత్యాల వాసి..
చివరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు వ్యక్తిగత భద్రత అధికారిగా, ప్రత్యేక దూతగా జగిత్యాలకు చెందిన మహ్మద్ ఉస్మానొద్దీన్ వ్యవహరించారు.  భారతదేశం తరఫున అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, హైద్రాబాద్ లో అప్పటి భారత ఏజెంట్ జనరల్ అంటే రాయబారి అయిన కె మున్షిలు హైదరాబాద్ నవాబుతో జరిపిన ఉత్తర ప్రత్యత్తురాలు, కీలక సందర్భాల్లో ఈ ఉస్మానోద్దీన్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. జగిత్యాలకు చెందిన ఉస్మానొద్దీన్ చేతుల మీదుగా ఇటు నవాబుకు అటు మున్షి ద్వారా పటేల్, మీనన్ లకు ఉత్తరాలు చేరేవి.


రజాకార్ల ప్రాబల్యం పెరిగి నిజాం పోలీసు వ్యవస్ధపై విశ్వాసం కోల్పోయిన సమయంలో భారతదేశం మున్షి ద్వారా ఉస్మానోద్దీన్ ను నమ్మగా ఆయన తన విధేయుతను చాటుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మోదటిసారిగా హైదరాబాద్ కు వచ్చినప్పుడు నవాబ్ ఉస్మాన్ అలీ ఖాన్ బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళి స్వాగతం పలుకగా ఆయన వెంట ఉస్మానోద్దీన్ ఉన్నారు. రజాకార్ల దమనకాండలో పాల్గొన్న అందరు ప్రభుత్వ ఉద్యోగులను ప్రత్యేకించి పోలీసులను ఉద్యోగాలలో నుండి తొలగించి శిక్షించిన భారత ప్రభుత్వం ఉస్మానోద్దీన్ ను మాత్రం అతని సత్ప్రవర్తన, సమయస్ఫూర్తి వ్యవహార శైలీ కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విలీన సమయంలో నిజాం నవాబు, వల్లభాయ్ పటేల్, నెహ్రూలతో సమావేశమైన సందర్భంగా తీసిన ఫొటోలో ఉస్మానొద్దీన్ పోలీస్ క్యాప్ లాంటిది ధరించినట్లుగా మనకు కనిపిస్తారు.


ఎవరీ ఉస్మానోద్దీన్.. 
జగిత్యాలలో పోస్ట్ మాస్టర్ గా ఆ తర్వాత సియాసత్ పత్రిక విలేకరిగా పని చేసిన స్వర్గీయ యూసుఫ్ సాజిద్ తండ్రి. అతని చిన్న కొడుకు ప్రస్తుతం జగిత్యాలలో ఒక పత్రికలో విలేకరిగా పని చేస్తున్నారు. యూసుఫ్ సాజిద్ తల్లి మరణించడంతో వారి అమ్మమ్మ, బంధువులు అతని చిన్నతనంలోనే జగిత్యాలకు తీసుకువచ్చి ఇక్కడే పెంచి పోషించారు. నవాబ్ ఉస్మాన్ అలీ ఖాన్ వ్యక్తిగత సిబ్బందిలో ఒకడిగా ఉండడంతో తీరిక లేని జీవితం, మొదటి భార్య మరణించిన తర్వాత రెండవ వివాహం చేసుకోవడంతో ఆయనకు జగిత్యాలకు దూరం పెరిగింది. తన తండ్రి గుర్తుగా ఆయన పేరును తన ఓ కుమారుడికి యూసుఫ్ సాజిద్ అని పెట్టుకున్నారు. జగిత్యాలలో పోస్ట్ మాస్టర్ గా పనిచేసిన సాజిద్ కొన్నేళ్ల కిందట చనిపోయాడు.