Letter To Sundar Pichai:


గూగుల్ ఉద్యోగుల లెటర్..


గూగుల్‌ ఈ మధ్యే లేఆఫ్‌లు ప్రకటించింది. ఒకేసారి 12 వేల మందిని తొలగించనున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే పలు బడా కంపెనీలు కూడా లేఆఫ్‌లు ప్రకటించాయి. అయితే...గూగుల్ ఉద్యోగులు మాత్రం కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్‌కు షాక్ ఇచ్చారు. ఉద్యోగులను కాస్త గౌరవంగా చూసుకోవాలంటూ లెటర్ రాశారు. 1,400 మంది ఉద్యోగులు ఈ మేరకు పిటిషన్‌పై సైన్ చేశారు. ఈ లెటర్‌లో పలు డిమాండ్‌లు చేశారు. కొంత కాలం పాటు రిక్రూట్‌మెంట్‌ను ఆపేయాలని తేల్చి చెప్పారు. ఒకవేళ రిక్రూట్‌మెంట్ జరిగినా...ఇప్పటికే జాబ్ పోయి అవకాశం కోసం చూస్తున్న వారికే ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అత్యవసర సమయాల్లో సెలవు తీసుకోవాల్సి వస్తే వాటిని పెయిడ్‌ ఆఫ్‌గా పరిగణించాలి. ఉదాహరణకు పేరెంటల్ సెలవులను కోట్ చేశారు ఉద్యోగులు. అంతే కాదు. సంక్షోభంలో ఉన్న దేశాల్లోని ఉద్యోగులను తొలగించకుండా చూడాలని సూచించారు. ఇందుకు ఉక్రెయిన్‌ను ఉదాహరణగా చూపించారు. వీసా సంబంధిత సమస్యల్నీ పరిష్కరించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా వర్క్‌ఫోర్స్‌ను తగ్గిస్తున్న ట్రెండ్ కొనసాగుతున్నప్పటికీ...దీనిపై తాము మాట్లాడాల్సిన అవసరముందని అన్నారు. అందుకే అంతా ఒక్కటై ఈ లేఖ రాస్తున్నట్టు వెల్లడించారు. 


6% మేర లేఆఫ్‌లు..


ఈ ఏడాది జనవరిలో గూగుల్ పేరెంట్ కంపెనీ Alphabet లేఆఫ్‌లు ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో 6% మందిని తొలగిస్తున్నట్టు తెలిపింది. కరోనా తరవాత పరిస్థితులు మారిపోయాయని, ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని స్పష్టం చేసింది. గూగుల్ మాత్రమే కాదు. ఈ లిస్ట్‌లో మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్‌ లాంటి బడా కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే...ఇప్పుడు ఉద్యోగులు వేసిన పిటిషన్‌పై గూగుల్ ఇంకా స్పందించలేదు. అమెరికాలో ఈ లేఆఫ్‌ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కొంత మందినైతే అప్పటికప్పుడే తొలగించేస్తున్నారు. ఉద్యోగులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను అసలు పట్టించుకోడం లేదని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సుందర్‌ పిచాయ్‌కు ఈ పిటిషన్ చేరే లోపు మరింత మద్దతు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఉద్యోగులు. 


జుకర్‌బర్గ్‌ మెయిల్ వైరల్..


మెటాలో భారీ మొత్తంలో లేఆఫ్‌లు కొనసాగుతున్న క్రమంలో మార్క్ జుకర్ బర్గ్ మెయిల్ ఒకటి వైరల్ అవుతోంది. 2010లో ఫేస్‌బుక్ ఎంప్లాయ్‌లకు "దయచేసి రిజైన్ చేయండి" అంటూ జుకర్ పంపిన మెయిల్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఓ ఉద్యోగి ఎంతో కీలకమైన అంతర్గత సమాచారాన్ని వేరే వాళ్లకు పంపాడని ఆరోపించింది ఫేస్‌బుక్. ఈ మేరకు "please resign" సబ్జెక్ట్ లైన్‌తో మెయిల్ పంపాడు. ఇంతకన్నా నమ్మకద్రోహం ఇంకేం ఉండదు అంటూ ఆ ఉద్యోగిపై ఫైర్ అయ్యాడు. దాదాపు 13 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన..ఇప్పుడు  Internal Tech Emails ద్వారా వెలుగులోకి వచ్చింది. "Confidential - Do Not Share" అనే లైన్‌తో స్టార్ట్ చేసి ఆ ఉద్యోగికి మెయిల్ పంపాడు జుకర్. 


"మేం కొత్త మొబైల్ ఫోన్ తయారు చేస్తున్నామని మీరు చెబుతున్నారు. మాకు అలాంటి ఆలోచనే లేదు. దీనిపై నేను క్లారిటీ ఇచ్చాను. ఎంతో మందికి సమాధానం చెప్పాను. మేం ఏం చేస్తున్నామో వివరించాను. యాప్స్‌ను ప్రజలకు ఇంకా ఎలా దగ్గర చేయాలన్నది మాత్రమే ఆలోచిస్తున్నాం. ఇంత కీలకమైన సమాచారాన్ని బయటి వాళ్లకు చెప్పడం అంటే నమ్మకద్రోహమే. ఈ సమాచారం ఎవరు లీక్ చేసినా సరే వెంటనే రిజైన్ చేయండి. ఇది తప్పేం కాదని మీరు భావిస్తే వెంటనే వెళ్లిపోండి. ఒకవేళ మీరు రిజైన్ చేయకపోతే మేమే మీరెవరో కనుక్కుని మరీ బయటకు పంపాల్సి ఉంటుంది. " 


- జుకర్ బర్గ్, 2010లో రాసిన మెయిల్‌ 


Also Read: సముద్రంలో దర్గా నిర్మాణం, బుల్‌డోజర్లతో కూల్చేసిన అధికారులు