Made-In-India iPhone: అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత నుంచి భారతదేశం బాగా లాభపడుతోంది. మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్‌లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి, వాటి వాటా ఇప్పుడు మరింత పెరగబోతోంది. ఆపిల్ ఐఫోన్ల తయారీకి భారత్‌లోనే మరో తయారీ ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది.
దాదాపు రూ. 8000 కోట్ల పెట్టుబడి
రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఆపిల్ కోసం ఐఫోన్ సహా చాలా ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలను తయారు చేసే తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్ (Foxconn), కర్ణాటకలో భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం కంపెనీ 967.91 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8000 కోట్లు) భారీ పెట్టుబడి పెట్టబోతోంది. ఫాక్స్‌కాన్ కొత్త పెట్టుబడిని (Foxconn India Investment) కర్ణాటక ప్రభుత్వం ఆమోదించింది.
ఫాక్స్‌కాన్ ప్లాంట్ ద్వారా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ప్లాంట్ ఏర్పాటు కోసం తైవాన్ కంపెనీ చాలా కాలంగా కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. అయితే, ఈ పెట్టుబడికి సంబంధించి కంపెనీ వైపు నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
కొత్త ఫ్లాట్ చాలా పెద్దది
బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో ఫాక్స్‌కాన్ 300 ఎకరాల ప్లాంట్‌ను (Foxconn Bengaluru Plant)) ఏర్పాటు చేయబోతోందని గతంలో వార్తలు వచ్చాయి. ఫాక్స్‌కాన్ గ్రూప్‌లోని ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన హాన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ (Hon Hai Precision Industry Company) ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ అనుబంధ సంస్థ, ఫాక్స్‌కాన్ తరపున ఆపిల్ ఐఫోన్లు తయారు చేస్తుంది.
నివేదికల ప్రకారం, హోన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ, ప్రధానంగా, ఆపిల్ ఐఫోన్‌ను కర్ణాటక ప్లాంట్‌లో తయారు చేస్తుంది. ఇది కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి కూడా ఈ ప్లాంట్‌ను ఫాక్స్‌కాన్ ఉపయోగించవచ్చు. ఒక వారం క్రితం వచ్చిన రాయిటర్స్ రిపోర్ట్‌ను బట్టి, ప్రతిపాదిత ప్లాంట్‌లో ఆపిల్ ఎయిర్‌పాడ్‌లను కూడా ఈ కంపెనీ రూపొందించవచ్చు. వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను తయారు చేయడానికి ఫాక్స్‌కాన్ ఇటీవలే ఆపిల్ నుంచి ఆర్డర్ పొందింది.
చైనా ప్లస్ వ్యూహంలో భాగంగా ఇండియాలోకి అడుగు
తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్, ప్రస్తుతం చైనాలోని జెంగ్‌జౌ నగరంలో ఉన్న ప్లాంట్‌లో ఆపిల్ ఐఫోన్‌లను తయారు చేస్తోంది. భారతదేశంలోనూ ఐఫోన్ తయారీని మొదలు పెట్టింది. COVID-19 సమయంలో జెంగ్‌జౌ ప్లాంట్‌లో ఉత్పత్తి ఆగిపోయింది. అమెరికా, చైనాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా, వివిధ అంతర్జాతీయ కంపెనీలు తమ చైనా ప్లస్ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. అంటే, చైనాతో పాటు వేరే దేశంలోనూ ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభిస్తున్నాయి. ఈ వ్యూహంలో భాగంగానే ఫాక్స్‌కాన్ కూడా చైనాకు బదులుగా ఇతర ఆప్షన్ల కోసం చూసింది, భారత్‌ను ఎంపిక చేసింది.
ఆపిల్ కంపెనీ కూడా భారత్‌లో తయారీ పట్ల చాలా ఉత్సాహంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న ఐఫోన్లలో సగానికి సగాన్ని 2027 నాటికి భారతదేశంలోనే అసెంబుల్ చేయాలని నిర్ణయించుకుంది.