యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కథానాయకుడిగా నటించనున్న తాజా సినిమా (NTR 30 Movie) ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. దీనికి కొరటాల శివ (Koratala Siva) దర్శకుడు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత తారక్ చేస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? కథ ఏమిటి? అటు అభిమానులు, ఇటు ప్రేక్షకుల్లో ఎన్నో ప్రశ్నలు. ఎన్టీఆర్ 30 ప్రారంభోత్సవంలో ఆ ప్రశ్నలకు సమాధానాలు వచ్చేశాయని చెప్పాలి.
మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్!
''అనగనగా సముద్ర తీర ప్రాంతం! మనం మర్చిపోయిన భూభాగం! ఆ ప్రాంతంలో మనుషుల కంటే ఎక్కువ మృగాలు ఉంటాయి (మృగాలు లాంటి మనుషులు అన్నమాట). భయం అంటే ఏమిటో తెలియని మృగాలు అవి. దేవుడు అంటే భయం లేదు. చావు అన్నా భయం లేదు. కానీ, ఒక్కటి అంటే భయం. ఆ భయం (ఎన్టీఆర్ పాత్రను ఉద్దేశిస్తూ...)ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. ఇదీ కథా నేపథ్యం'' - ఎన్టీఆర్ 30 ప్రారంభోత్సవంలో కొరటాల శివ కథ గురించి చెప్పిన వ్యాఖ్యలు ఇవి.
మృగాలు వంటి మనుషులను భయపెట్టే మగాడిగా, చాలా శక్తివంతంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉంటుందని పరోక్షంగా ఆయన చెప్పేశారు. ''భయం ఉండాలి, భయం అవసరం కూడా! భయపెట్టడానికి సినిమాలో ప్రధాన పాత్ర (హీరో) ఏ స్థాయికి వెళతాడనేది ఎమోషనల్ రైడ్. ఇది నా బెస్ట్ సినిమా అని ప్రామిస్ చేస్తున్నాను'' అని కొరటాల శివ వివరించారు.
నా సోదరుడితో రెండోసారి!
ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయడం గురించి కొరటాల శివ మాట్లాడుతూ ''ఎన్టీఆర్ గారితో రెండోసారి సినిమా చేస్తున్నాను. 'జనతా గ్యారేజ్' తర్వాత ఆయన్ను డైరెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఆయనతో పని చేయడం నిజంగా అదృష్టం. ఈ తరంలో అత్యుత్తమ నటులలో ఎన్టీఆర్ ఒకరు. నాకు సోదరుడితో సమానం'' అని వివరించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''ఇంత పెద్ద ఐడియాను తీసుకు వెళ్ళడానికి గొప్ప ఆర్మీ కావాలి. నాకు మంచి సాంకేతిక బృందం కుదిరింది. ఈ కథకు ప్రాణం పోయాలంటే... నేను ఎంత రాయాలో, అనిరుధ్ అంత మంచి సంగీతం అందించాలి. కథ చెప్పిన తర్వాత 'ఫైర్ తో రాశారు' అని చెప్పాడు. నాకు ఎంతో సంతోషాన్ని కలిగింది. స్క్రిప్ట్ రాస్తున్నప్పటి నుంచి లెజెండరీ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు నాతో ట్రావెల్ చేస్తున్నారు. గొప్ప సినిమాటోగ్రాఫర్ రత్నవేలు గారు సినిమా స్టార్ట్ కాకముందు నుంచి, గత ఏడాదిగా నాతో ట్రావెల్ అవుతున్నారు. నా ఊహకు రూపం ఇవ్వాలంటే... ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ తప్ప ఇంకెవరు లేరు'' అని చెప్పారు.
నేను తిరిగి వస్తున్నా...
థాంక్యూ తారక్ - అనిరుధ్!
ఎన్టీఆర్ 30కి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 'అజ్ఞాతవాసి', 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' సినిమాల తర్వాత తెలుగులో ఆయన చేస్తున్న చిత్రమిది. సినిమా ప్రారంభోత్సవంలో అనిరుధ్ మాట్లాడుతూ ''ఏడాది క్రితం దర్శకుడు కొరటాల శివ గారిని కలిశా. ఎప్పుడు కలిసినా ఓ మంచి ఫీలింగ్ ఉంటుంది. ఆయన ఊహలో నేను ఓ భాగం కావడం సంతోషంగా ఉంది. ఆయన ఊహ భారీగా ఉంటుంది. ప్రాణం పోయగలనని అనుకుంటున్నా. లెజెండ్స్ తో కలిసి పని చేసే అవకాశం ఈ సినిమాతో లభించింది. మోషన్ పోస్టర్ సంగీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ ఇచ్చిన శివ గారికి, తారక్ గారికి థాంక్స్... నేను తిరిగి వస్తున్నాను'' అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో రత్నవేలు, శ్రీకర్ ప్రసాద్ తదితరులు మాట్లాడారు.
Also Read : రాజమౌళి క్లాప్‌తో మొదలైన ఎన్టీఆర్ 30 - అతిరథ మహారథుల సమక్షంలో...