‘RRR’ మూవీలోని ‘‘నాటు నాటు’’ పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘ఆస్కార్’ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. ఈ పాటకు సంగీతాన్ని అందించిన ఎం.ఎం.కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్‌లు ఆస్కార్ అవార్డులను అందుకోవడం చూసి యావత్ భారతీవనీ పరవశించింది. అయితే, ఆస్కార్ క్యాంపైన్‌లో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాత్రమే కనిపించారు. ఆ సినిమా నిర్మించిన డీవీవీ దానయ్య మాత్రం ఎక్కడా కనిపించలేదు. కనీసం ఆయన పేరు కూడా ఎక్కడా వినిపించలేదు. దీంతో రాజమౌళి టీమ్‌కు, డీవీవీ దానయ్యకు మధ్య స్పర్థలు వచ్చాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 


దానయ్య తన సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో హర్షం వ్యక్తం చేశారు. సినిమా నిర్మించడం వరకే తన బాధ్యత అని కూడా వెల్లడించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డుల క్యాంపైన్ కోసం రూ.80 కోట్ల వరకు ఖర్చు పెట్టేరనే వార్తలపై స్పందించారు. ‘‘నేను కూడా ఈ విషయాన్ని విన్నాను. ఆస్కార్ అవార్డులో ‘ఆర్ఆర్ఆర్’ కాంపైన్ కోసం నేనైతే డబ్బులేవీ ఖర్చు పెట్టలేదు. కచ్చితంగా ఏం జరిగిందనేది కూడా నాకు తెలీదు. అవార్డుల కోసం ఎవరూ.. రూ.80 కోట్లు ఖర్చు పెట్టలేదు. దానివల్ల ఎలాంటి లాభం చేకూరదు’’ అని తెలిపారు.


ఆ ఖర్చుతో 8 సినిమాలు తీయ్యొచ్చు- భరద్వాజ


రూ.80 కోట్ల అంశం ఇంతగా చర్చకు రావడానికి కారణం.. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలే. ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతి ప్రివ్యూ థియేటర్‌  ‘వివాదాస్పద విషయాలపై సినిమాల నిర్మాణం’ అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న భరద్వాజ పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ‘RRR’ సినిమా బృందం ఆస్కార్ కోసం చేస్తున్న ఖర్చుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆస్కార్ కోసం పోటీ పడుతున్న ‘RRR’ సినిమా టీమ్ విమాన ఖర్చులకు పెట్టిన డబ్బుతో 8 సినిమాలు తియ్యొచ్చని చెప్పారు. "RRR సినిమా కోసం రూ. 600 కోట్ల బడ్జెట్ అయింది. మళ్లీ ఆస్కార్ కోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టారు. అదే రూ.80 కోట్లతో 8 సినిమాలు చేయొచ్చు. వాళ్లు ఊరికే ఫ్లైట్ టికెట్లకు రూ.80 కోట్లు ఖర్చు పెట్టారు" అని భరద్వాజ అన్నారు.


రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆస్కార్ వేదికపై ఎందుకు డ్యాన్స్ చేయలేదు?


‘RRR’ హీరోలు ఆస్కార్ వేదికపై ఫర్మార్మెన్స్ ఎందుకు ఇవ్వలేదో తాజాగా నిర్మాత రాజ్ కపూర్ వెల్లడించారు. వారి స్థానంలో లాస్ ఏంజెల్స్ డ్యాన్సర్లను ఎంపిక చేసినట్లు చెప్పారు. “ఆస్కార్‌ వేదికపై ‘నాటు నాటు’ పాటను ప్రదర్శించే అరుదైన అవకాశం మన వారికి దక్కింది. ఆస్కార్ 2023 వేదికపై కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్‌ పాడుతుంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ చేయాల్సి ఉండేది. కానీ, పలు కారణాలతో వారు వెనక్కి తగ్గారు. వారి వ్యక్తిగత కారణాలు, ప్రాక్టీస్ కు సమయం లేకపోవడం సహా పలు కారణాలతో తప్పుకున్నారు. ఒరిజినల్ నంబర్‌ సాంగ్ కు సంబంధించి రెండు నెలల పాటు వర్క్‌ షాప్ చేశారు. ఆ తర్వాత రిహార్సల్ చేసి 15 రోజుల పాటు పాటను చిత్రీకరించారు.  కానీ, ఇక్కడ వారికి ప్రాక్టీస్ చేసే అవకాశం దొరకకపోవడంతో ‘నాటు నాటు’ ప్రదర్శనను  లాస్ ఏంజిల్స్‌ లో ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లతో రిహార్సల్ చేయించాం. సుమారు 18 గంటల పాటు వారి రిహార్సల్స్ కొనసాగాయి” అని వెల్లడించారు. న్యూఢిల్లీలో పుట్టి కెనడాలో పెరిగిన నిర్మాత రాజ్‌కపూర్‌కి చాలా సంవత్సరాలుగా అకాడమీ సంస్థతో అనుబంధం ఉంది. గాయకులు, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్‌ తో ‘నాటు నాటు’ ప్రత్యక్ష ప్రదర్శన కోసం అతను ‘RRR’ బృందంతో కలిసి పనిచేశారు.


Read Also: అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన హిట్, ఫ్లాప్ మూవీస్ ఇవే? బన్నీ ఫ్యాన్స్ షాకవ్వడం పక్కా!