Online Gambling Ban:
తమిళనాడులో..
ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌ను నిషేధిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఓ బిల్ పాస్ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ అసెంబ్లీలో ఈ బిల్‌ను ప్రవేశపెట్టారు. గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించిన తరవాత ఈ చట్టం అమల్లోకి వస్తుంది. గతేడాదే ఈ బిల్‌ను ప్రవేశపెట్టినప్పటికీ గవర్నర్ దీనిపై పూర్తి స్థాయి వివరణ కోరారు. ఆ మేరకు వివరణ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ తరవాత కీలక వ్యాఖ్యలు చేశారు స్టాలిన్.
"2022 అక్టోబర్ 19న Online Gambling Prohibition Billని పాస్ చేశాం. ఆ తరవాత అక్టోబర్ 26న గవర్నర్‌కు పంపాం. నవంబర్ 26న ఆయన పూర్తి స్థాయి వివరణ కోరారు. అది కూడా చేశాం. దాదాపు 131 రోజుల తరవాత ఈ ఏడాది మార్చి 6న తుది రూపు వచ్చింది."
- ఎమ్‌కే స్టాలిన్, తమిళనాడు సీఎం
గవర్నర్‌తో ఉన్న రాజకీయ విభేదాలనూ ప్రస్తావించారు స్టాలిన్. పొలిటికల్‌గా ఎవరి అజెండా వారిదే అయినా...ఈ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌ను అరికట్టడంలో కలిసి రావాలని కోరారు. ఇవి ప్రాణాలనూ బలిగొంటున్నాయని అన్నారు.
"ఈ బిల్‌ను గవర్నర్ పరిశీలనకు పంపుతాం. మా మధ్య రాజకీయ విభేదాలు ఉండొచ్చు. కానీ ఇది ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి గేమ్స్‌ను అరికట్టాల్సిందే. ప్రజలను రక్షించుకోవడం ప్రభుత్వ హక్కు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌ను నియంత్రించేందుకు చట్టం చేసుకోవచ్చని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్వయంగా పార్లమెంట్‌లో వెల్లడించారు"
- ఎమ్‌కే స్టాలిన్, తమిళనాడు సీఎం
తమిళనాడులో ఈ యాప్స్ కారణంగా ఒత్తిడికి లోనై 47 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్‌ను తీసుకొచ్చింది. అయితే..కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ అంశంపై గతంలోనే స్పందించారు. ఆన్‌లైన్ గేమ్స్ సమస్యలు రానురాను మరీ సంక్లిష్టంగా మారుతున్నాయని అన్నారు. కొందరు ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌కి అలవాటు పడి, మోసపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ తరహా ఘటనలు పెరిగాయి. అందుకే...తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.జస్టిస్ చంద్రు ప్యానెల్ ఇచ్చిన నివేదిక ప్రకారం...ఆన్‌లైన్ రమ్మీని పూర్తిగా నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది ప్రభుత్వం. గతంలో రెండు సార్లు ఈ బిల్ పాస్ చేయాలని చూసినా...మద్రాస్ హైకోర్ట్ తీర్పుతో అది సాధ్యపడలేదు.