Bulldozer Action In Mumbai:


ముంబయిలో...


ముంబయిలోని సముద్రంలో ఆక్రమిత స్థలంలో దర్గా నిర్మాణం చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ Maharashtra Navnirman Sena చీఫ్ రాజ్ థాక్రే అల్టిమేటం జారీ చేశారు. నెల రోజుల్లోగా ఆ నిర్మాణ పనులు ఆపకపోతే అదే స్థలంలో గణేషుడి మందిరం కడతామని హెచ్చరించారు. గొడవలు జరిగే ప్రమాదముందని గుర్తించిన అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. ఇందుకోసం బుల్‌డోజర్లు పట్టుకొచ్చారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మహారాష్ట్ర మంత్రి దీపక్ కేసర్కార్ స్పందించారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా...అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. 


"బాలాసాహెబ్ థాక్రే బాటలోనే మా ప్రభుత్వం నడుస్తోంది. అప్పట్లో బాలాసాహెబ్ థాక్రే ఏ అంశం గురించైతే మాట్లాడారో..అదే విషయాన్ని మరోసారి రాజ్‌థాక్రే ప్రస్తావించారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్‌లోని అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలైంది. ఇక్కడ ఏ నిర్మాణం చేపట్టాలన్నా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి" 


- దీపక్ కేసర్కార్, మహారాష్ట్ర మంత్రి 






అంతకు ముందు రాజ్‌థాక్రే తీవ్ర హెచ్చరికలు చేశారు. ముంబయి సముద్ర తీరంలో దర్గా ఎలా నిర్మిస్తారంటూ నినదించారు. నెల రోజుల్లోగా ఆ నిర్మాణాన్ని కూల్చకపోతే అదే స్థలంలో గణేషుడి ఆలయం కట్టి తీరతామని తేల్చి చెప్పారు. సెంట్రల్ ముంబయిలోని శివాజీ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే ప్రోగ్రామ్‌లో దర్గా నిర్మాణానికి సంబంధించిన వీడియోని టెలికాస్ట్ చేశారు. ముస్లింలపై తనకు ఎలాంటి కోపం లేదని, కానీ ఇలాంటి పనులను మాత్రం ఖండించాల్సిందేనని వెల్లడించారు. 


"నేను కరడుగట్టిన హిందువుని కాను. జావేద్ అక్తర్ లాంటి ముస్లింలు మనకు కావాలి. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లు కావాలి. మన పవర్ ఏంటో చూపించే వ్యక్తులు కావాలి. జావేద్ అక్తర్ ఆ పని చేశారు. ముస్లింలు అందరూ ఆయనలాగే ఉండాలన్నదే నా ఆకాంక్ష. మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు పెట్టి ప్రార్థనలు చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ మా పోరాటాన్ని మళ్లీ మొదలు పెడతాం. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోకపోతే మేమే ఏదోటి తేల్చేస్తాం. "


- రాజ్ థాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు


మసీదులలో లౌడ్‌స్పీకర్లు తొలగించాలని నిరసనలు చేపట్టిన తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు రాజ్‌థాక్రే. 17 వేల కేసులు పెట్టారని, వాటన్నింటినీ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.