AAP vs BJP in Delhi:


అవినీతి పరుడు అంటూ పోస్టర్లు..


ఇటీవల ఢిల్లీలో పలు చోట్ల ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించడం సంచలనమైంది. పోలీసులు వెంటనే అప్రమత్తమై వాటిని తొలగించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఇప్పటికే ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదంతా ఆప్ చేసిన పనే అని బీజేపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఈ వివాదం నడుస్తుండగానే మరోసారి పోస్టర్ల కలకలం మొదలైంది. ఈసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. "అవినీతిపరుడు" అంటూ కేజ్రీవాల్‌ ఫోటోతో సహా ప్రింట్‌ చేసి పలు చోట్ల గోడలకు అంటించారు. "అరవింద్ కేజ్రీవాల్‌ను ఇంటికి పంపండి. ఢిల్లీని కాపాడండి" అని నినాదాలు కూడా  రాశారు. బీజేపీ నేత మనిజేందర్ సింగ్ ఈ పని చేయించారన్న ఆరోపణలున్నాయి. దీనిపై కేజ్రీవాల్ స్పందించారు. తానూ ఈ పోస్టర్లను చూశానని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా అలాంటి పోస్టర్లు పెట్టుకునే హక్కు ఉందని చెప్పారు. 


"ఈ పోస్టర్లతో నాకొచ్చిన సమస్యేమీ లేదు. ప్రింటింగ్ ప్రెస్ ఓనర్లను, పోస్టర్లు అంటించిన వారిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో నాకర్థం కావడం లేదు. ప్రధాని మోదీ భయపడుతున్నారనడానికి ఇదే నిదర్శనం. అలాంటి పోస్టర్లు అంటించినంత మాత్రాన జరిగే నష్టం ఏముంది..? ప్రధాని మోదీ ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోవడం సరికాదు"


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 






ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ తరవాత ఆప్, బీజేపీ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. అందులో భాగంగానే ఈ పోస్టర్ వార్ మొదలైంది. ముందు రోజు కనిపించిన ప్రధాని మోదీ పోస్టర్లు రాజకీయాల్ని వేడెక్కించాయి. మోదీ ఓ డిక్టేటర్‌ అంటూ వేలాది పోస్టర్లు అంటించారు. వీటిని చూసి బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలెర్ట్ అయిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు 100 కేసులు నమోదు చేశారు. అరెస్ట్ అయిన నలుగురిలో ఇద్దరికి ప్రింటింగ్‌ ప్రెస్‌లు ఉన్నాయి. "మోదీ హఠావో, దేశ్ బచావో" అని వెలిసిన పోస్టర్లను తొలగించారు పోలీసులు. ఇప్పటికే 2 వేల పోస్టర్లను తీసేశారు. పబ్లిక్ ప్రాపర్టీలపై ఇలాంటి పోస్టర్లు అంటించడం నేరం. పైగా వీటిని ప్రింట్ చేసిన ప్రింటింగ్ ప్రెస్ పేరు కూడా లేదు. చట్టరీత్యా ఇది నేరం అని పోలీసులు తేల్చి చెప్పారు. అంతే కాదు. ఈ పోస్టర్లన్నీ ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యాలయానికి వెళ్తున్నట్టు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని ఓ వ్యాన్‌లో భారీ మొత్తంలో ఈ పోస్టర్లు ఉన్నట్టు తెలిపారు. డ్రైవర్‌ను ప్రశ్నించగా ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యాలయానికి తీసుకెళ్తున్నానంటూ సమాధానమిచ్చాడు. అంతకు ముందే కొన్ని పోస్టర్లు డెలివరీ చేసినట్టు చెప్పాడు. ఆప్‌ ఈ వివాదంపై స్పందించింది. ఈ పోస్టర్లలో అంత అభ్యంతరకరమైన విషయం ఏముందని ప్రశ్నించింది. FIRలు నమోదు చేయడంపైనా అసహనం వ్యక్తం చేసింది.


Also Read: Chaitra Navratri 2023: 100 మందిని సన్యాసులుగా మార్చేయనున్న రామ్‌దేవ్‌ బాబా, ముహూర్తం కూడా పెట్టేశారు