Sanyas Diksha Progamme: 



రామనవమి రోజున సన్యాసం..


యోగా గురు బాబా రామ్ దేవ్‌ బాబా ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రామ నవమి రోజున 100 మంది మహిళలు, పురుషులను సన్యాసులుగా మార్చనున్నారు. పతంజలి యోగపీఠ చైత్ర నవరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రామ్‌ దేవ్ బాబా సమక్షంలో 40 మంది మహిళలు, 60 మంది పురుషులు సన్యాసం తీసుకోనున్నారు. దీంతో పాటు 500 మంది మహిళలు, పురుషులు బ్రహ్మచర్యం తీసుకోనున్నారు. ఇటీవలే మహాప్రాణ యజ్ఞం పూర్తి చేసిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రామ్‌దేవ్ బాబా వెల్లడించారు. హిందూ సనాతన ధర్మాన్ని రక్షించేందుకు, ఆ ధర్మం బోధించిన సన్యాసులకు గౌరవమిచ్చేందుకు ఈ కార్యక్రమం మొదలు పెట్టినట్టు తెలిపారు. వేదాల్లోని సారాన్ని అధ్యయనం చేసిన వాళ్లు, సనాతన ధర్మాన్ని గౌరవించే వారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్టు వివరించారు. భారత దేశ సనాతన ధర్మాన్ని కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. 


"పతంజలి యోగపీఠ్‌లో మహిళలు, పురుషులు అన్న తేడాలు ఉండవు. కులం, మతం ఆధారంగా విడదీయం. వీళ్లంతా ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తారు. ఇంకొంత మంది సన్యాసం తీసుకునేలా చొరవ చూపిస్తారు. రామ రాజ్యం నాటి రోజులను తిరిగి తీసుకురావాలన్నదే మా ఆకాంక్ష. రామ మందిర నిర్మాణంతో ఆ కల సాకారమవుతుంది. ఇది జాతీయ ఆలయంగా చిరస్థాయిలో నిలబడిపోతుంది"


- రామ్‌దేవ్ బాబా 


ఇదే సమయంలో జమ్ముకశ్మీర్ సహా పలు కీలక అంశాలనూ ప్రస్తావించారు రామ్‌దేవ్‌ బాబా. ముఖ్యంగా బీజేపీ అజెండాలోని విషయాలపై మాట్లాడారు. 


"అయోధ్య రామ మందిరం వచ్చే జనవరి నాటికి పూర్తవుతుంది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేశారు. వీటితో పాటు ఇంకొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలి. జనాభా నియంత్రణకు కొత్త చట్టం తీసుకురావాలి. వచ్చే ఏడాది నాటికి ఈ రెండు పనులూ పూర్తవుతాయని ఆశిస్తున్నాను"


- రామ్‌దేవ్ బాబా 


సివిల్‌ కోడ్‌పైనా వ్యాఖ్యలు..


రామజన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి సన్యాస్ దీక్ష ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 15 వందల మంది యువత..సన్యాసం తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఇలాంటి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో, వాటిని అమలు చేయడంలో స్వామి రామ్‌దేవ్ బాబా విజయం సాధించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొననున్నారు. గతంలోనూ రామ్‌ దేవ్‌ బాబా ఇదే విధంగా 100 మందిని సన్యాసం తీసుకునేలా చొరవ చూపించారు. హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. 


సంచలన వ్యాఖ్యలు..


యోగా గురు రామ్‌ దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముస్లింలను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి. ముస్లింలు అందరూ ఉగ్రవాదులు, రేపిస్ట్‌లు అంటూ నోరు జారారు. అప్పటి నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీన బర్మేర్ జిల్లాలో జరిగిన ఓ ఈవెంట్‌లో ముస్లింలు, క్రిస్టయన్లను ఉద్దేశిస్తూ మాట్లాడారు 
రాం దేవ్ బాబా. 


"ముస్లింలు తప్పనిసరిగా ఉదయం ప్రార్థనలు చేస్తారు. రోజుకు ఐదు సార్లు నమాజ్ చేయాలంతే. ఆ తరవాత ఏమైనా చేసుకోవచ్చు. హిందూ అమ్మాయిలను పరిచయం చేసుకుని ఎన్ని పాపాలైనా చేయొచ్చు. చాలా మంది ముస్లింలు ఇదే చేస్తారు. కానీ నమాజ్‌ను మాత్రం కొనసాగిస్తారు. టెర్రరిస్ట్‌లు, క్రిమినల్స్‌లా కనిపించే వీళ్లు నమాజ్‌తో వాటిని కవర్ చేస్తారు. ఇస్లాం అంటే నమాజ్ చేయడం అని మాత్రమే వాళ్లకు తెలుసు. కానీ హిందూ మతం అలా కాదు" 
- బాబా రాం దేవ్, యోగా గురు 


Also Read: QR code on Tombstone: కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్, జ్ఞాపకాలను సజీవంగా దాచిన కుటుంబం