ఒమిక్రాన్ వేరియెంట్ భారీ స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. దేశంలో కొవిడ్-19 పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నేటి సాయంత్రం 6:30 గంటలకు కీలక సమీక్ష జరగనుంది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు ఉన్నాయని ఏఎన్‌ఐ తెలిపింది. బహుశా నియంత్రణ చర్యలు, కట్టడి కోసం ఆంక్షలపై నిర్ణయాలు తీసుకోవచ్చు! రాత్రి కర్ఫ్యూల వంటి అంశాలు చర్చించొచ్చు!
దేశంలో మంగళవారం నాటికి 200 ఒమిక్రాన్ కేసులు దాటాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుండటం కలవరపెడుతోంది. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిక ప్రాంతాలు కలిపి ఒమిక్రాన్ కేసుల సంఖ్య 250 దాటిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదిక ద్వారా తెలుస్తోంది. అత్యధికంగా దిల్లీలో 57, మహారాష్ట్ర 54, తెలంగాణ 24 కేసులు ఉన్నాయి.
ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఇప్పటికే అప్రమత్తం చేసింది. వార్‌రూమ్‌లను తిరిగి చైతన్యం చేయాలని సూచించింది. రాత్రి కర్ఫ్యూలు, కంటైన్‌మెంట్ జోన్లు, ఒమిక్రాన్ బాధితులకు పడకలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియెంట్ మూడు రెట్లు వేగంగా సంక్రమిస్తుందని వెల్లడించింది.
సమావేశంలో బూస్టర్ డోస్ గురించీ చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. శాస్త్రీయత ఆధారంగానే బూస్టర్ డోస్‌పై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ ఇంతకు ముందే అన్నారు. కాగా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ యోధులకు బూస్టర్ డోస్ ఇవ్వాలని దిల్లీలోని ఐఎల్‌బీఎస్‌కు చెందిన డాక్టర్ ఎస్‌కే సరిన్ విజ్ఞప్తి చేశారు. రెండు డోసుల రక్షణ 3-6 నెలల్లో తగ్గిపోతుందని, సంక్రమణ తగ్గించాలంటే బూస్టర్ కచ్చితమని వారు అంటున్నారు.
ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో క్రిస్‌మస్, కొత్త సంవత్సరం వేడుకలను ప్రభుత్వాలు నిషేధించాయి. దిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక చర్యలు తీసుకోవడంలో ముందున్నాయి.
Also Read: Snapdeal IPO: ఐపీవోకు స్నాప్‌డీల్.. రూ.1250 కోట్ల సమీకరణకు ముసాయిదా దాఖలు
Also Read: Card Tokenization: డెబిట్, క్రెడిట్ కార్డు టోకెనైజేషన్ గడువు పొడగించాలని ఆర్‌బీఐకి వినతి
Also Read: Tesla Smartphone: క్రేజీ ఎలన్ మస్క్! టెస్లా నుంచి మొబైల్ ఫోన్.. ఫీచర్లు ఇవే!!
Also Read: Multibagger Stock: 19 నెలల్లో రూ.లక్షకు రూ.20 లక్షల లాభం ఇచ్చే మల్టీబ్యాగర్