Niti Aayog Meeting Highlights: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీ వేదికగా నీతి ఆయోగ్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రధాని మోదీ కీలక అంశాలు చర్చించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ముద్ర రుణాలతో పాటు ప్రధాన మంత్రి విశ్వకర్మ, ప్రధాన మంత్రి స్వనిధి లాంటి పథకాల్లో సంస్కరణలు చేయాల్సిన అవసరముందని మోదీ స్పష్టం చేశారు. వీటితో పాటు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో మార్పులు చేయాలని తేల్చి చెప్పారు. తద్వారా భారత సమాజంలోనే కాకుండా ఆర్థిక వ్యవస్థనూ మార్చేందుకు అవకాశం లభిస్తుందని వెల్లడించారు. ఇదే సమయంలో దేశ యువత గురించి కూడా మోదీ ప్రస్తావించారు. ప్రపంచంలోనే అత్యధిక వర్క్‌ఫోర్స్ ఉన్న దేశం భారత్ మాత్రమేనని, దీన్ని దృష్టిలో పెట్టుకుని యువతలో నైపుణ్యాలు పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నైపుణ్యాలతో పాటు పరిశోధన, ఆవిష్కరణలు, ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలని అన్నారు.
ఈ మేరకు నీతి ఆయోగ్ అఫీషియల్ X అకౌంట్‌లో ఈ వివరాలు వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం సాధించడంలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలని సూచించారు మోదీ. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలకు దగ్గరగా ఉండే అవకాశం ఉంటుందని, అందుకే మరింత చొరవ చూపించాలని వెల్లడించారు. ప్రస్తుతం భారత్ సరైన మార్గంలో వెళ్తోందని, కరోనా లాంటి సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొన్నామని స్పష్టం చేశారు. దేశ ప్రజల్లో ఎంతో విశ్వాసం పెరిగిందని అన్నారు. వికసిత్ రాష్ట్రాలతోనే వికసిత్ భారత్ సాధ్యమని తేల్చి చెప్పారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ భారత్ అభివృద్ధి దిశగా దూసుకుపోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించాలని అన్నారు. భారత్‌ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డారు.
మమతా బెనర్జీ వాకౌట్ వివాదం..
నీతి ఆయోగ్ సమావేశం ఈ సారి రసాభాసగా మారింది. మమతా బెనర్జీ భేటీ జరుగుతుండగానే మధ్యలో బయటకు వచ్చేశారు. ప్రతిపక్షాలు ఈ సమావేశాన్ని బైకాట్ చేయగా ఆమె ఒక్కరే వెళ్లారు. అయితే...మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వలేదన్న అసహనంతో బయటకు వచ్చేసినట్టు ఆమె స్పష్టం చేశారు. అంతే కాదు. మాట్లాడుతుండగానే మైక్ ఆఫ్ చేశారని ఆరోపించారు. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం క్లారిటీ ఇచ్చారు. ఆమెకి ఎంత సమయం ఇచ్చామో అంత సమయమూ ఆమె మాట్లాడారని, అంతకు మించి ఆమె సమయం తీసుకోవాలనుకున్నారని వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల్లో మైక్ ఆఫ్ చేయాల్సి వచ్చిందని నిర్మలా సీతారామని స్పష్టం చేశారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశమిచ్చామని, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చివర్లో అవకాశం వచ్చిందని సీఈవో సుబ్రహ్మణ్యం వివరించారు. ప్రతి ముఖ్యమంత్రికీ 7 నిముషాలు మాత్రమే కేటాయించామని స్పష్టం చేశారు. ఆ సమయం తరవాత కూడా ఆమె మాట్లాడాలని ప్రయత్నిస్తేనే అడ్డుకోవాల్సి వచ్చిందని, అంతకు మించి అక్కడ జరిగిందేమీ లేదని తేల్చి చెప్పారు.
Also Read: Paris Olympics 2024: ఒలిపింక్స్‌లో భారత్ తరపున బీజేపీ ఎమ్మెల్యే, ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?