Bihar MLA Shreyasi Singh: Paris Olympics 2024 లో భారత్ తరపున 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. వీళ్లలో బిహార్‌కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఆమె పేరు శ్రేయసిసింగ్. అటు పాలిటిక్స్‌లోనే కాకుండా ఇటు స్పోర్ట్స్‌లోనూ రాణిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే అర్జున అవార్డు పొందిన శ్రేయసిసింగ్ 2020లో ఎన్నికల్లో పోటీ చేశారు. జముయి నియోజవర్గం నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగి విజయం సాధించారు. 2014లో గ్లాస్గోలో నిర్వహించిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో షూటింగ్‌లో డబుల్ ట్రాప్ కేటగిరీలో సిల్వర్ మెడల్ సాధించారు శ్రేయాసి. ఆ తరవాత 2018లో జరిగిన Gold Coast పోటీల్లో గోల్డ్‌ మెడల్ సొంతం చేసుకున్నారు. బిహార్‌లోని గిదౌర్‌లో పుట్టి పెరిగిన ఆమె ఢిల్లీలోని హన్స్‌రాజ్ కాలేజ్‌లో ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తరవాత ఫరియాబాద్‌లో మనవ్రచన యూనివర్సిటీలో MBA చేశారు. శ్రేయసిసింగ్‌ కుటుంబానికి రాజకీయ నేపథ్యముంది. ఆమె తండ్రి కాంగ్రెస్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్. తల్లి పుతుల్ సింగ్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. బంకా నియోజవర్గం నుంచి ఆమె ఎంపీగా ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ రాజకీయాల్లో ఉండడం వల్ల శ్రేయసిసింగ్‌కి పాలిటిక్స్‌పై కూడా ఆసక్తి పెరిగింది. 2020లో బిహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై 41 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 






శ్రేయసితండ్రి దిగ్విజయ్‌ సింగ్‌తో పాటు ఆమె తాతయ్య కుమార్ సురేంద్ర సింగ్‌ National Rifle Association కి ఒకప్పుడు అధ్యక్షులుగా పని చేశారు. వీళ్లిద్దరి నుంచి స్ఫూర్తి పొందిన శ్రేయసిసింగ్ షూటింగ్‌పై ఆసక్తి పెంచుకున్నారు. ఎమ్మెల్యే అయ్యాక ఎక్కువ సమయం రాజకీయాల కోసం కేటాయించాల్సి వచ్చింది. బిహార్‌లో ప్రాక్టీస్ చేయడానికి సౌకర్యాలు లేక ఢిల్లీకి వెళ్లేవారు. ఇటు రాజకీయాల్ని, అటు క్రీడల్ని మేనేజ్ చేయడం ఇబ్బందిగానే అనిపించినప్పటికీ ఆ సవాల్‌ని ఎదుర్కొన్నారు. రెండు రంగాల్లోనూ రాణిస్తున్నారు. 



పారిస్ ఒలింపిక్స్‌లో చైనా తొలి స్వర్ణం సొంతం చేసుకుంది. పది మీటర్ల ఎయిర్ రైఫిల్‌ మిక్స్‌డ్ టీమ్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్ సాధించింది. కొరియాకి చెందిన కియుమ్, పార్క్‌లపై ఫైనల్‌లో చైనాకి చెందిన షెంగ్, హువాంగ్‌ 16-12 తేడాతో విజయం సాధించారు. 


 




Also Read: Road Accident: జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం, లోయలో పడిన వాహనం - 5 గురు చిన్నారులు సహా 8 మంది మృతి