Paris Olympics 2024 opening ceremony Highlights: చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించేలా... విశ్వ క్రీడాకారులను ఏకం చేసేలా.. కళ్లు మిరుమిట్లు గొలిపేలా.. ఫ్రాన్స్ సంస్కృతిని, వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా.. పారిస్ ఒలింపిక్స్ 2024(Paris Olympics 2024) ఘనంగా ఆరంభమయ్యాయి. క్రీడా ప్రేమికులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న విశ్వ క్రీడలను ఫ్రాన్స్... కనీవినీ ఎరుగని రీతిలో ఆరంభించింది. ప్రపంచం ప్రతీ క్షణాన్ని కళ్లార్పకుండా చూస్తున్న వేళ... అతిరథ మహారథులు, క్రీడా దిగ్గజాలు. రాజకీయ ప్రముఖుల మధ్య ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ పారిస్ ఒలింపిక్స్ ప్రారంభమవుతున్నట్లు ప్రకటించాడు. భారీ వర్షం కురిసినా లక్షలాదిమంది అభిమానులు ఈ వేడుకను చూసేందుకు భారీగా తరలివచ్చి... క్రీడలపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వంద సంవత్సరాల్లో మూడోసారి క్రీడలను నిర్వహిస్తున్న పారిస్ చరిత్రలో నిలిచిపోయేలా ఈ వేడుకను నిర్వహించింది.
న భూతో న భవిష్యతీ
వేలాది మంది క్రీడాకారులు సీన్ నదిపై పరేడ్ నిర్వహిస్తుండగా... ఫ్రాన్స్ వైభవాన్ని చాటేలా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ భూమిపై నిర్వహించే అతిపెద్ద క్రీడా సంబరానికి... అంతకంటే ఘనంగా నిర్వహించింది ఫ్రాన్స్. ఫ్రెంచ్ జూడో గ్రేట్ టెడ్డీ రైనర్, స్ప్రింటర్ మేరీ జోస్ పెరె...వేడి గాలి బెలూన్‌లో ఉన్న జ్యోతిని వెలిగించడంలో పారిస్ ఒలింపిక్స్ క్రీడలు ఆరంభమయ్యాయి. 205 దేశాలకు చెందిన 6,800 మంది అథ్లెట్లు 85 పడవల్లో నిర్వహించిన పరేడ్ ఆకట్టుకుంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో చారిత్రక ప్రదేశాలను ముద్దాడుతూ అథ్లెట్ల పరేడ్ ముందుకు సాగింది. ఎరుపు, తెలుపు, నీలం రంగుల బాణసంచా వెలుగుల్లో ఆస్టర్‌లిట్జ్ వంతెన మెరిసిపోయింది.
ఊపేసిన లేడీగాగా
ఈ వేడుకలో అమెరికన్ పాప్ స్టార్ లేడీ గాగా ఉర్రుతలూగించింది. కెనడియన్ ఐకాన్ సెలిన్ డియోన్ ప్రదర్శన ఆకట్టుకుంది. లేడీ గాగా గొంతుకు అక్కడున్న ప్రజలు కూడా వంతపాడారు. నృత్యం చేస్తూ సందడి చేశారు. దీంతో పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు ఫుల్ జోష్‌గా సాగాయి. దాదాపు 2,000 మంది సంగీతకారులు, నృత్యకారులు, ఇతర కళాకారులు ఫ్రాన్స్ చరిత్ర, కళ, క్రీడల ప్రాముఖ్యాన్ని తమదైన శైలిలో వివరించారు. వచ్చే ఒలింపిక్స్ లాస్ ఏంజెల్స్ 2028 నిర్వహించే అమెరికా, ఆ తర్వాత ఆతిథ్య ఫ్రాన్స్‌కు చెందిన అథ్లెట్లు ఈ సంబరాల్లు అత్యధికంగా పాల్గొన్నారు.
దిగ్గజాల టార్చ్ రన్
క్రీడా దిగ్గజాలు జినెడిన్ జిదానే, రాఫెల్ నాదల్, నాడియా కొమనేసి, సెరెనా విలియమ్స్ ఒలింపిక్ టార్చ్ పట్టుకుని కాసేపు పరుగు తీశారు. దానిని దిగ్గజ సైక్లిస్ట్ చార్లెస్ కోస్ట్, ఫ్రెంచ్ అథ్లెట్లు, పారా అథ్లెట్‌ల శ్రేణికి అందించారు. వారు దానిని ఫ్రెంచ్ జూడో గ్రేట్ టెడ్డీ రైనర్, స్ప్రింటర్ మేరీ జోస్ పెరెకు అందించారు. వారిద్దరూ బెలూన్‌లో ఉన్న జ్యోతిని వెలిగించి అది గగనతలంలోకి ఎగరడంతో పారిస్ ఒలింపిక్స్ క్రీడలు ఆరంభమయ్యాయి.
వర్చువల్ టెక్నాలజీ అద్భుతం
ముసుగు ధరించిన వ్యక్తి టార్చ్‌తో పరుగులు తీస్తూ ఫ్రాన్స్ చరిత్ర, వైభవాన్ని.. పారిస్‌లోని ప్రత్యేకతలన్నింటికీ ప్రపంచానికి చాటుతూ ముందుకుసాగాడు. తాడు సాయంతో గాల్లోకి ఎగిరి నది దాటి అబ్బురపరిచాడు. వర్చువల్ టెక్నాలజీ ద్వారా మరో వ్యక్తి ఫ్రాన్స్ గత చరిత్రను, వైభవాన్ని, తరతరాల సంస్కృతిని చాటి చెప్పాడు. ఈ వర్చువల్ టెక్నాలజీ ద్వారా పారిస్‌లోని చారిత్రక కట్టడాలను ప్రపంచ కళ్లకు కట్టారు. లవ్ సిటీ ప్రత్యేకతను తెలిపేలా ఆకాశంలో విమానాల పొగతో ఏర్పాటు చేసిన హార్ట్ సింబల్ క్రీడా అభిమానులను అబ్బురపరిచింది.