Attacks on France’s Rail Network: ఒలింపిక్స్‌లో భద్రతపై మరోసారి సందేహాలు వ్యక్తమయ్యాయి. ముష్కరులు 2024 ఒలింపిక్స్‌ను లక్ష్యంగా చేసుకున్నారన్న వార్తలతో వివిధ దేశాల అథ్లెట్లను తీసుకెళ్తున్న రెండు రైళ్లను పారిస్‌కు వెళ్లే మార్గంలో నిలిపేసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పశ్చిమ అట్లాంటిక్ లైన్‌లో పారిస్‌కు ఒలింపిక్ అథ్లెట్లను తీసుకువెళుతున్న రెండు రైళ్లను నిలిపేసినట్లు ఫ్రాన్స్‌  రైలు సంస్థ SNCF అధికారికంగా ప్రకటించింది. ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకలకు కొన్ని గంటల ముందు ఈ పరిణామం జరగడం తీవ్ర కలకలం రేపింది. ఉగ్రవాదులు ఈ రైళ్లపై దాడి చేస్తారన్న హెచ్చరికలతో ఒక రైలును రద్దు చేయగా.. మరో రైలును క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం మళ్లీ పంపించారు. దుండగులు రైల్వే నెట్‌వర్క్ కేబుళ్లను కత్తిరించారని, ఈ దుశ్చర్యతో రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఫ్రాన్స్‌ రైల్వే వెల్లడించింది.
 


 

గతంలో ఎప్పుడూలేని విధంగా....

ఫ్రాన్స్‌లో  హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్ గతంలో ఎన్నడూ చూడని విధంగా గణనీయమైన అంతరాయాన్ని ఎదుర్కొంది. గతంలో ఎన్నడూ లేనంతగా రైల్‌ నెట్‌వర్క్ స్తంభించడంతో అసలు ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు కాసేపు గందరగోళానికి గురయ్యారు. ఈ ఘటనలో ఫ్రాన్స్‌లో భద్రతా లోపం మరోసారి తెరపైకి వచ్చింది. SNCF, TGVనెట్ వర్క్ కు సంబంధించి కేబుల్ వ్యవస్థ పూర్తిగా కాలిపోయిందని... కేబుల్ వ్యవస్థ కాలిపోవడానికి ఉగ్ర సంస్థలే కారణమని అనుమానిస్తున్నామని ఫ్రెంచ్‌ రైల్వే అధికారులు చెప్తున్నారు. 

 

ఒలింపిక్సే లక్ష్యమా...?

పారిస్‌ నగరాన్ని లిల్లే, బోర్డియక్స్, స్ట్రాస్‌బర్గ్ వంటి నగరాలతో అనుసంధానించే కీలక రైలు మార్గాల్లోని సిగ్నల్ సబ్‌స్టేషన్లు, కేబుల్‌లను విధ్వంసకారులు లక్ష్యంగా చేసుకున్నారని SNCF నివేదించింది. పారిస్-మార్సెయిల్ మార్గాన్ని కూడా దెబ్బ తీయాలని ప్రయత్నించారని కానీ తాము దాన్ని సమర్థంగా తిప్పికొట్టామని తెలిపింది. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ  ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన విడుదల చేయలేదు. ఏదీ ఏమైనా పారిస్‌ ఒలింపిక్స్‌కు భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని పలు దేశాలు అధ్యక్షుడు మేక్రాన్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్‌లోని కీలక రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకున్నారని... రైల్వే నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసే కుట్ర జరిగిందని...  అన్నింటినీ అధిగమించామని ఫ్రెంచ్‌ ప్రధానమంత్రి గాబ్రియెల్‌ అట్టల్‌ తెలిపారు. అయితే ప్రయాణికులందరూ తమ ప్రయాణాలను వాయిదా వేయాలని SNCF కోరింది. 

 


దర్యాప్తు షురూ...

విశ్వక్రీడల ప్రారంభానికి ముందు రైల్వే లైన్లపై దాడులు క్రీడలపై జరిగిన దాడిగా భావిస్తున్నామని ఫ్రాన్స్ క్రీడా మంత్రి ప్రకటించారు. పారిస్‌ను వివిధ నగరాలకు కలిపే రైలు మార్గాలను కలిపే సిగ్నలింగ్‌ బాక్సులకు కూడా నిప్పు పెట్టారని.. దానిపైనా లోతైన దర్యాప్తు చేస్తున్నామని ఫ్రాన్స్‌ ప్రభుత్వ రైలు కంపెనీ తెలిపింది. మరోవైపు ఈ దుశ్చర్యకు పాల్పడింది ఎవరన్న దానిపై దర్యాప్తు ప్రారంభమైంది. ఈ దాడుల వెనక ఉన్న వారిని గుర్తించేందుకు పోలీసులు, ఫ్రాన్స్‌ నిఘా వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఫ్రెంచ్ ప్రధానమంత్రి గాబ్రియెల్ అట్టల్ వెల్లడించారు.