Paris 2024 Olympics Opening Ceremony details : పారిస్ ఒలింపిక్స్‌(Paris olympics) ఆరంభోత్సవానికి సమయం సమీపిస్తోంది. ఐకానిక్ సీన్ నదిపై జరిగే మహాద్భుత ఈవెంట్‌ను కళ్లారా చూసేందుకు క్రీడా ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ ప్రారంభోత్సవ సంబరాల్లో ప్రతీ ఘట్టం చాలా ప్రత్యేకంగా.. ఘనంగా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్టేడియం వెలుపల విశ్వ క్రీడల ప్రారంభోత్సవం నిర్వహించడం చరిత్రలో తొలిసారి కావడంతో దానికి తగ్గట్లే కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేశారు. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రమఖులు, దేశాధినేతలు,  వేలాది మంది ప్రదర్శనకారులతో ఆరంభ వేడుక అదిరిపోనుంది. భారత పతాకాన్ని చేతబూని ఆచంట శరత్‌ కమల్‌, పీవీ సింధు ముందు నడవనున్నారు. 


చరిత్రలో తొలిసారి

ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలు స్టేడియం వెలుపల జరగడం ఇదే తొలిసారి. ఆరంభ వేడుకల్లో 94 పడవలు పాల్గొననున్నాయి. ఈ నౌకల వెంట ఫ్రాన్స్‌ నౌకాదళం కూడా కవాతు చేయనుంది. ఆరు కిలోమీటర్లు సాగే ఈ కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 206 జాతీయ ఒలింపిక్ కమిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 10,500 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొంటారు. 

 

సమయం 

రాత్రి 11 గంటలకు ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుక ఆరంభం అవుతుంది. మూడు గంటల కంటే ఎక్కువ సమయం ఉంటుందని భావిస్తున్నారు. 

 

ప్రారంభం ఎక్కడ..?

 అథ్లెట్ల పరేడ్‌ జార్డిన్ డెస్ ప్లాంటెస్ సమీపంలోని ఆస్టర్లిట్జ్ వంతెన వద్ద ప్రారంభమవుతుంది అథ్లెట్లు లా కాంకోర్డ్ అర్బన్ పార్క్, ఇన్వాలిడ్స్, గ్రాండ్ పలైస్‌తో సహా అనేక ఒలింపిక్ వేదికలను కవర్‌ చేస్తూ ముందుకు సాగుతారు. లేనా వంతెన వద్ద అథ్లెట్ల పరేడ్‌  ముగుస్తుంది. అక్కడే ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రారంభ ప్రసంగం చేస్తారు. 

 

ఒలింపిక్ టార్చ్ బేరర్

హిప్ హాప్ లెజెండ్ స్నూప్ డాగ్ ఒలింపిక్ టార్చ్ బేరర్‌గా వ్యవహరిస్తారు. పారిస్‌ శివారు సెయింట్ డెనిస్ చుట్టూ టార్చ్‌తో ప్రదర్శన నిర్వహిస్తారు. 

 

ప్రారంభ వేడుకలను చూడటానికి టిక్కెట్లు 

2024 పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు చూసేందుకు 2,22,000 ఉచిత టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. ఇప్పటికే చాలా టికెట్లను తీసుకున్నారు. లక్షకుపైగా టికెట్లను నామమాత్రపు రుసుముతో అందుబాటులో ఉంచారు. ప్రారంభ వేడుకలు చూసేందుకు పారిస్‌ అంతటా 80 భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. 

 

అథ్లెట్లు ఏమి ధరించాలి?

 ఓపెనింగ్ సెర్మనీలో భారతీయ అథ్లెట్లు పురుషులు కుర్తా, మహిళలు చీరలు ధరించే అవకాశం ఉంది. భారత పతాకాన్ని చేతబూని ఆచంట శరత్‌ కమల్‌, పీవీ సింధు ముందు నడవనున్నారు. 

 

లేడీగాగా ప్రదర్శన

కెనడియన్ గాయని సెలిన్ డియోన్, అమెరికా పాప్‌స్టార్‌ లేడీ గాగా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంది. దువా లిపా, అరియానా కూడా ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంది.య గ్రాండే ఉన్నారు. 

 

లింగ సమానత్వం చాటేలా..? 

పారిస్ ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలు లింగ సమానత్వం, స్థిరత్వం, సాంస్కృతిక  వారసత్వాన్న చాటేలా సాగనున్నాయి. పారిస్ 2024 స్లోగన్ "గేమ్స్ వైడ్ ఓపెన్" అనే నినాదాన్ని చాటుతూ పారిస్‌ నడిబొడ్డున వేడుకలు జరగనున్నాయి.