IOC faces calls for investigation into inclusion of child rapist at Olympics: ఒలింపిక్స్(Olympics)లో మరో వివాదం కలకలం రేపుతోంది. 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి జైలు శిక్ష కూడా అనుభవించిన ఓ అథ్లెట్‌ను విశ్వ క్రీడలకు ఎంపిక చేయడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. రేపిస్ట్‌ను ఎలా ఎంపిక చేస్తారంటూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్వయాన విచారణకు ఆదేశించింది. చేసిన తప్పుకు శిక్ష అనుభవించిన వ్యక్తిని ఇంకా వేధించడం తగదని కొందరు... అతడు చేసింది చిన్న నేరమేమీ కాదని ఇంకొందరు సోషల్ మీడియా వేదికగా వాదనకు దిగుతున్నారు. ఏది ఏమైనా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు సమయం సమీపిస్తున్న వేళ... నెదర్లాండ్స్‌కు చెందిన చైల్డ్ రేపిస్ట్ ఉదంతం తీవ్ర సంచలనంగా మారింది.
అసలు ఏం జరిగిందంటే?
స్టీవెన్ వాన్ డి వెల్డే 2014 లో ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బ్రిటన్‌కు చెందిన 12 ఏళ్ల బాలికతో ఆన్‌లైన్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు వెల్డే . ఆమెను కలవటానికి ఆమ్‌స్టర్‌డామ్ నుండి UKకి వెళ్ళాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్న సమయంలో ఆమెతో మద్యం తాగించి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 2016లో బ్రిటన్ కోర్టు అతనికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే నేరస్థుల బదిలీ ఒప్పందాల ప్రకారం వెల్డే నెదర్లాండ్ కు చేరుకొని శిక్ష అనుభవించాడు. 2017లో వెల్డే విడుదల అయ్యాడు. అయితే ఈ శిక్ష తనను బాగా మార్చివేసింది అంటాడు స్టీవెన్ వాన్ డి వెల్డే. తాను చేసిన తప్పును తలుచుకొని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పాడు. ఆ మానసిక క్షోభ నుంచి బయట పడేందుకే తాను మరోసారి క్రీడల వైపు ద్రుష్టి పెట్టానన్నాడు. తనకు చాలా చిన్నతనం నుంచే ఒలింపిక్స్ లో ఆడటం తన కల అని. తాను చేసిన తప్పు మాత్రం తనను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది అని తనకు తెలుసు అని చెప్పాడు. చేసిన తప్పును తాను ఎంతగానో పశ్చాత్తాప పడుతున్నానన్నాడు.
బాధ్యతా రహితంగా, పూర్తి నిర్లక్ష్యంగా చిన్నపిల్లపై అత్యాచారం చేసిన వ్యక్తిని ఒలింపిక్స్‌కు ఎలా ఎంపిక చేస్తారని ఇంగ్లండ్, వేల్స్ మానవ హక్కుల సంఘం సీఈవో సియారా బెర్గ్‌మాన్ ప్రశ్నించారు. ఈ ఎంపికతో పిల్లలపై అత్యాచారం చేసినా విశ్వ క్రీడల్లో పాల్గొనవచ్చనే తప్పుడు సందేశం వెళ్తుందని అన్నారు. డచ్ జట్టులో వాన్ డి వెల్డేను చేర్చుకోవడం ఈ ఒలింపిక్స్‌పై తీవ్రమైన ప్రభావం చూపుతుందని అన్నారు. మహిళలు, బాలికలపై జరిగే హింసను వ్యతిరేకించాలని సూచించారు. వాన్ డి వెల్డేను ఒలింపిక్స్‌లో పోటీకి ఎలా అనుమతించారనే విషయంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
అయితే దీనిపై వెల్డే స్పందించాడు. తనను సెక్స్ రాక్షసుడిగా, కామాంధుడిగా చిత్రీకరిస్తున్నారని... ఆవేదన వ్యక్తం చేశాడు. తాను జైలు నుంచి విడుదలయ్యాక తన ప్రవర్తనను గమనించాలని అభ్యర్థించాడు. తెలిసీ తెలియన వయసులో చేసిన దానిని తాను సమర్థించుకోవడం లేదని... దానికి తగిన శిక్ష అనుభవించానని తెలిపాడు.