Paris Olympics 2024 First Gold Winner: పారిస్: నాలుగేళ్లకు ఒకసారి జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరం ఒలింపిక్స్. ఈ ఏడాది ఫ్రాన్స్ ఒలింపిక్ గేమ్స్ 2024కు ఆతిథ్యమిచ్చింది. పారిస్ ఒలింపిక్స్ లో తొలి స్వర్ణం చైనా సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో స్వర్ణంతో చైనా ఒలింపిక్స్‌లో ఖాతా తెరిచింది.  హువాంగ్, షెంగ్ ధ్వయం ఫైనల్లో 16-12 తేడాతో కొరియాకు చెందిన పార్క్, కియుమ్ లపై గెలుపొందారు. దాంతో పారిస్ ఒలింపిక్స్ లో తొలి స్వర్ణం నెగ్గిన దేశంగా చైనా నిలిచింది. ఫైనల్లో ఓడిన కొరియా జోడి పాక్క్, కియుమ్ లు రజతంతో సరిపెట్టుకోగా, మూడో స్థానంలో నిలిచిన కజకిస్తాన్ కు చెందిన సట్యపాయెవ్, లె లకు కాంస్య పతకాలు లభించాయి.






ఈ ఒలింపిక్స్ తొలి పతకం నెగ్గింది వీరే..
పారిస్ ఒలింపిక్స్ లో తొలి స్వర్ణం నెగ్గింది చైనా ప్లేయర్లు. కానీ తొలి మెడల్ గెలుచుకున్నది మాత్రం కజకిస్తాన్. ఒలింపిక్స్ 2024లో తొలి పతకం నెగ్గిన ప్లేయర్లుగా కజకిస్తాన్ కు చెందిన అలెగ్జాండ్రా లె, ఇస్లామ్ సట్పాయెవ్ లు నిలిచారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్యం సాధించి విశ్వ క్రీడల్లో పతకాల ఖాతా తెరిచారు.  


ఒలింపిక్స్ వేడుకల్లో తప్పిదం, నిర్వాహకుల క్షమాపణలు
ఈ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ పరేడ్‌లో ఓ పొరపాటు జరిగింది. శుక్రవారం సెన్‌ నదిపై పారిస్‌ ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకల్లో దక్షిణ కొరియాను ఉత్తర కొరియాగా పరిచయం చేశారు. అదెలాగంటే.. ఈ ఆరంభ వేడుకల్లో  ఫ్రెంచ్‌ అక్షర క్రమంలో ఒక్కో దేశం పరేడ్‌లో పాల్గొన్నాయి. ఈ క్రమంలో దక్షిణ కొరియా క్రీడాకారుల బృందం బోట్‌లో జెండాను ఊపుతూ వచ్చిన సమయంలో.. వారి దేశాన్ని డెమోక్రాటిక్ పీపుల్స్‌ ఆఫ్ కొరియా అని అనౌన్స్ చేశారు. ఉత్తరకొరియా అధికారిక నామమే ఈ డెమోక్రాటిక్ పీపుల్స్‌ ఆఫ్ కొరియా. దక్షిణ కొరియా పేరును రిపబ్లిక్‌ ఆఫ్ కొరియాగా వ్యవహరిస్తారు. అంటే దక్షిణ కొరియాను ఉత్తర కొరియాగా ప్రస్తావించడంతో జరిగిన పొరపాటుకు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ నిర్వాహకులు క్షమాపణలు కోరారు. విశ్వ క్రీడల్లో ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని దక్షిణ కొరియా స్పోర్ట్స్ మినిస్టర్ ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్‌ను కోరారు.