Godavari Flood Level Increased In Badrachalam: ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడంతో నదీ పరీవాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శనివారం మధ్యాహ్నానికి నీటిమట్టం 52.20 అడుగులకు చేరగా.. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగించారు. తాజాగా, నీటి మట్టం 53 అడుగులకు పెరగడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉద్ధృతితో భద్రాచలం పరిసర ప్రాంతాలకు రవాణా స్తంభించింది. దుమ్ముగూడెం వెళ్లే రహదారిలో ప్రధాన రహదారులు నీట మునిగి రాకపోకలు బంద్ అయ్యాయి. స్థానిక ఏఎంసీ కాలనీ చుట్టుపక్కల బ్యాక్ వాటర్ చేరుకోవడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా, వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అధికార యంత్రాంగం అప్రమత్తం
గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ.. లోతట్టు గ్రామాల ప్రజలను అలర్ట్ చేయాలని సూచించారు. అటు, దుమ్ముగూడెం, పర్ణశాల వద్ద గోదారి నీటిమట్టం 25 అడుగులు దాటింది. సున్నంబట్టి రోడ్డుపైకి గోదావరి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సుంకేశులకు భారీగా వరద
జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి శివారులోని సుంకేశుల జలాశయానికి వరద పోటెత్తింది. ఎగువ నుంచి 82,300 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 20 గేట్లు ఎత్తిన అధికారులు నీటిని విడుదల చేశారు. దీంతో 75,220 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి తరలివెళ్తోంది. సుంకేశుల పూర్తి స్థాయి నీటి నిల్వ 1.235 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.507 టీఎంసీలుగా ఉంది. అటు, మలుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరికి నీటిమట్టం పెరిగింది. ఈ క్రమంలో వెంకటాపురం నుంచి భద్రాచలం వెళ్లే మార్గంలో భోదాపురం, కుక్కతోగు, బల్లకట్టు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రహదారిపైకి నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు, తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన బొగత జలపాతానికి సైతం వరద పోటెత్తింది. వెంకటాపురం మండలంలో పాలెంవాగు జలాశయం నాలుగు గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న వేళ చేపల వేటకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ధవళేశ్వరం వద్ద..
ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు రాజమహేంద్రవరం వైపుగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 13.75 అడుగుల నీటిమట్టం కొనసాగుతుండడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలోకి 12.72 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అటు, కోనసీమలోని గౌతమి, వశిష్ట, వైనతేయ నదీ పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాల్లో వరద నీరు చుట్టుముట్టడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ధవళేశ్వరం నుంచి వరద నీరు సముద్రంలోకి వదులుతుండడంతో యానాంలో ప్రవహించే గౌతమీ గోదావరి బాలయోగి వారధి వద్ధ వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాజీవ్ బీచ్ పరీవాహక ప్రాంతంలో మత్స్యకారులు అప్రమత్తమయ్యారు. వారి మెకనైజ్డ్ బోట్లు, నావలు, వలలు కొట్టుకుపోకుండా జాగ్రత్తలు చేపట్టారు.