Munawar Faruqui Profile: 


పాలిటిక్స్‌పై సెటైర్లు..


మునావర్ ఫారుకీ. ఇప్పుడు హైదరాబాద్ అంతా ఈ కుర్రాడి గురించే మాట్లాడుకుంటోంది. నార్త్‌లో ఇప్పటికే ఎంతో ఫేమస్ ఈ స్టాండప్ కమెడియన్. హైదరాబాద్‌లో కామెడీ షో చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. దీనిపైనే ప్రస్తుతం పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ షో జరపాలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. ప్రభుత్వం మాత్రం ఆయన షో చేసుకునేందుకు అనుమతినిచ్చింది. అటు కేటీఆర్ ఈ షో కి సపోర్ట్ చేశాడు. సో..క్రమంగా కామెడీ షో అంశం కాస్తా...సీరియస్ షోగా మారిపోయింది. పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఏమైనా అల్లర్లు జరుగుతాయేమోనన్న ముందస్తు జాగ్రత్తతో రాజాసింగ్‌ను గృహనిర్బంధం చేశారు. ఇది వాతావరణాన్ని ఇంకా వేడెక్కించింది. అసలు... మునావర్ ఫారూకీ కామెడీ షో చేయాలనుకుంటే..భాజపా ఎందుకు అభ్యంతరం చెబుతోంది. అసలు రాజకీయాలతోనే సంబంధం లేని ఓ స్టాండప్ కమెడియన్‌పై కాషాయ పార్టీ ఎందుకు కన్నెర్ర చేస్తోంది..? ఈ లింక్ ఎక్కడుంది..? తెలుసుకుందాం. 


ఎవరీ కుర్రాడు..? 


మునావర్ ఫారుకీ స్వస్థలం గుజరాత్‌లోని జునాగఢ్. స్టాండప్ కమెడియన్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది నాలుగేళ్ల క్రితమే. పాలిటిక్స్‌పై సెటైర్లు వేయటం మునావర్ స్టైల్. పార్టీలు, రాజకీయ నాయకుల పేర్లు నేరుగా ప్రస్తావించకుండా చురకలు అంటిస్తుంటాడు. సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. యూట్యూబ్ ఛానల్‌కి 34 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారంటే అర్థంచేసుకోవచ్చు ఈ కుర్రాడు ఎంత ఫేమసో. బాగా హిట్ అయిన పాటల్ని పేరడీ చేస్తుంటాడు. అవి కూడా పాలిటిక్స్‌పై సెటైరికల్‌గానే ఉంటాయి. గుజరాత్ అల్లర్ల నుంచి బాలీవుడ్‌లో నెపోటిజం వరకూ అన్ని టాపిక్స్‌పైనా మాట్లాడతాడు. కామెడీ చేస్తాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో లాక్‌డౌన్ టైమ్‌లో చేసిన రజాక్‌భాయ్ సిరీస్‌తో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. టెలివిజన్ యాంకర్లను ఇమిటేట్ చేయటంతో పాటు మీర్జాపూర్ సిరీస్‌పై చేసిన కామెడీ కూడా బాగా పేలింది. కంగనా రనౌత్‌ హోస్ట్‌గా చేసిన లాకప్‌ షో విన్నర్‌ గా నిలిచాక ఇంకా ఫేమస్ అయ్యాడు. 


స్టాండప్‌ టు లాకప్.. 
 
వేరే టాపిక్స్‌పైన కామెడీ చేస్తే ఏ గోల ఉండదు. కానీ..మునావర్ టార్గెట్ చేసేదే పాలిటిక్స్ పైన. అలాంటప్పుడు తప్పకుండా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా గమనిస్తుంటారు. మునావర్ ఎక్కువగా భాజపాను ఉద్దేశిస్తూ సెటైర్లు వేస్తుంటాడు. ఇక్కడే వచ్చింది సమస్య. స్టాండప్ కామెడీ కదా అని కొందరు లైట్ తీస్కున్నా...కొన్ని వర్గాల్లో మాత్రం అసహనం వ్యక్తమైంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా కొన్ని కామెంట్స్ చేశాడనీ అప్పట్లో పెద్ద కాంట్రవర్సీ అయింది. "హిందూ దేవుళ్లపై, భాజపా నాయకులపై వెకిలిగా మాట్లాడుతూ దాన్ని కామెడీ అంటే మేం ఒప్పుకోవాలా" అంటూ కొందరు
బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చినికి చినికి గాలి వానగా మారి..చివరకు మునావర్‌ను జైలుపాలు చేసింది. హిందువులను కించపరిచాడంటూ ఓ భాజపా ఎమ్మెల్యే కేసు పెట్టాడు. ఫలితంగా..2021  జనవరి 1వ తేదీన మధ్యప్రదేశ్ పోలీసులు మునావర్ ఫారుకీని అరెస్ట్ చేశారు. "Dongri to Nowhere" పేరిట చేసిన కామెడీ షో అత్యంత వివాదాస్పదమైంది. దాదాపు నెల రోజుల పాటు ఇండోర్‌ జైల్లో శిక్ష అనుభవించాడు. ఆ తరవాత సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయటం వల్ల జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ ఇన్సిడెంట్ తరవాత ఒక్కసారిగా మునావర్ పేరు మారుమోగింది. జైలు నుంచి విడుదలైనప్పటికీ..భాజపా మాత్రం మునావర్ స్టాండప్‌ కామెడీ షో అంటేనే చాలు ఒంటికాలి మీద లేస్తుంది. 


హైదరాబాద్‌లో రెండు సార్లు షో క్యాన్సిల్..


గతేడాది అరెస్టై విడుదల అయ్యాక అందరి చూపు మునావర్‌పై పడింది. భాజపా సిద్ధాంతాలను విభేదించే వారి నుంచి ఈ కమెడియన్‌కు మద్దతు పెరిగింది. గతేడాది డిసెంబర్‌లో మంత్రి కేటీఆర్ మునావర్ ఫారూకీని హైదరాబాద్‌ల్ షో చేయాలని ఆహ్వానించారు. కానీ..భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ అడ్డుకున్నారు. అప్పుడు కూడా మునావర్‌ విషయమై భాజపా వర్సెస్ తెరాస ఫైట్ నడిచింది. ఈ ఏడాది జనవరిలోనూ ప్రయత్నాలు జరిగినా..అదీ సాధ్యం కాలేదు. ఇప్పుడు మరోసారి షో డేట్ ఫిక్స్ అయినా...భాజపా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అసలే తెలంగాణలో భాజపా, తెరాస మధ్య అమీతుమీ అన్నట్టుగా పోరు నడుస్తోంది. ఇప్పుడు మునావర్ ఫారుకీ కామెడీ షోతో అది ఇంకా పెరిగింది. 


Also Read: Munavar Vs Raja Singh : మునావర్‌ షోకు అనుమతి - రాజాసింగ్ హౌస్ అరెస్ట్ ! సీరియస్ మ్యాటర్‌గా స్టాండప్ కామెడీ !