Computer Education: గతంలో కంప్యూటర్ విద్య పట్ల కనిపించినా ఆసక్తి ప్రస్తుత ప్రభుత్వ విద్యాశాఖ అధికారులలో కనిపించడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అమలవుతున్న టెక్ ఎడ్యుకేషన్ పై బయట పడుతున్న గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ స్టడీస్ వైపు అన్ని దేశాలు అడుగులు వేస్తుంటే ఇక్కడ మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కొన్నేళ్ల కిందట ప్రారంభించిన కంప్యూటర్ల శిక్షణ ఇప్పుడు లేదు.


మెయింటెనెన్స్ లేక మూలపడిన సామాగ్రి.. 
పలు ప్రభుత్వ స్కూళ్లలో కంప్యూటర్లు ఇతర సాంకేతిక సంబంధిత సామాగ్రి మెయింటెనెన్స్ లేక మూల పడ్డాయి. దీంతో విద్యార్థులు బేసిక్ కోర్స్ నోచుకోని పరిస్థితి నెలకొంది. నిజానికి పిల్లలు ఆడియో విజువల్ తరహాలో నేర్చుకునే విద్య ఎక్కువ కాలం పాటు వారికి ఉపయోగపడుతుంది. అందుకే గతంలో  టీచర్లకు సైతం కంప్యూటర్ శిక్షణ ఇచ్చి విద్యార్థులకు ఉచితంగా బోధించాలనే నిబంధన పెట్టారు. దానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలో విధి విధానాలను రూపొందించారు. కానీ గత కొంత కాలం నుండి ఈ పద్ధతి బోధనలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి.


ఇదీ పరిస్థితి..! 
జిల్లాలో 650 పాఠశాలల్లో 49 వేల 754 మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో మొత్తం 149 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 2006లో కంప్యూటర్ శిక్షణ ను ప్రారంభించింది. 11 కంప్యూటర్లతో పాటు ఇతర సామాగ్రి తో కూడిన ల్యాబ్ ఏర్పాటు చేయడానికి అనుమతించింది. వీటి నిర్వహణ మొత్తం ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా కంప్యూటర్ బోధించడానికి ప్రత్యేకంగా సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు. అయితే 2013లో ఈ సిబ్బందిని తొలగించడంతో ఈ శిక్షణ కార్యక్రమం ఆగిపోయింది. దాదాపుగా తొమ్మిది ఏళ్ళు  గడుస్తున్నా ఇప్పటికీ ఆయా కంప్యూటర్ల నిర్వహణ గురించి గానీ శిక్షణ గురించి గానీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. మొత్తం 149 స్కూళ్లలో 981 కంప్యూటర్లు ఏర్పాటు చేసినా ఉపయోగం మాత్రం సున్నా.. ఇక కొన్ని స్కూల్ లో ఉన్న కంప్యూటర్లు వాటి విడి భాగాలు లెక్కల్లో  మాత్రమే మిగిలాయి. దాదాపుగా సగానికి పైగా సిస్టమ్స్ పని చేయడం లేదని అధికారులు అంచనా వేశారు. దీంతో ఒక గొప్ప ఆశయంతో ప్రారంభమైన ప్రభుత్వ విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ పథకం లక్ష్యం చేరకుండా మధ్యలోనే నిలిచిపోయింది.


ట్రైనింగ్ పేరుతో లక్షలు వృథా.. 
నిజానికి ఇంత పెద్ద ఎత్తున కంప్యూటర్ ల్యాబ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ  కేవలం శిక్షణ ఇచ్చేవారు లేకపోవడంతో పథకం ఆగిపోయిందని అధికారులు అంటున్నారు. కానీ ఎంఈఓ కార్యాలయంలోని ఐఎంఎస్ కోఆర్డినేటర్లు పాఠశాలలోని కంప్యూటర్లకు రిపేర్ చేయగలిగే బేసిక్ లెవల్ ట్రైనింగ్ అప్పటికే విద్యాశాఖ ఇచ్చింది. ఇలాంటప్పుడు ఉన్నతాధికారులు సరైన సమన్వయంతో దూర దృష్టితో ఆలోచించి.. కంప్యూటర్ శిక్షణని పునరుద్ధరిస్తూ ఈ టెక్నాలజీ యుగంలో ప్రభుత్వ విద్యార్థులు సైతం దూసుకు పోగలరు. అంతులేని ఉపాధి అవకాశాలు ఉన్న కంప్యూటర్ శిక్షణ కనీస జీత భత్యాలతో కూడిన ఉద్యోగానికి సోపానం అని పలుమార్లు నిరూపితమైంది. కాబట్టి భవిష్యత్ తరాలకు ఈ విద్యను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.