Morbi Bridge Collapse: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని కెవాడియాలో సోమవారం జరిగిన జాతీయ ఐక్యతా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' వద్ద సర్దార్ పటేల్‌కు నివాళులర్పించారు ప్రధాని మోదీ.
ఈ సందర్భంగా మోర్బీలో వంతెన కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 134కు చేరింది.
ఇదీ జరిగింది
మోర్బీ నగరంలోని మచ్చు నదిపై బ్రిటీష్ కాలం నాటి తీగల వంతెన ఆదివారం కుప్పకూలింది. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మంది ఉన్నట్లు సమాచారం. వంతెన కూలడం వల్ల చాలామంది నీటిలో పడి గల్లంతయ్యారు. సందర్శకులు నదిలో పడిపోగానే ఆ ప్రాంతంలో భీతావహ పరిస్థితులు కనిపించాయి.
ఈతరాని వారు మునిగిపోగా.. చాలామంది రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. ఒకరిపై ఒకరు పడడం వల్ల కొంతమంది గాయపడ్డారు. మరికొంతమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తీగలను పట్టుకుని వేలాడుతూ కనిపించారు. నీళ్లలో మునిగిపోతున్నవారిని రక్షించేందుకు మరి కొంతమంది ప్రయత్నించారు. వంతెన కూలిన ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక విభాగం అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతైనవారి కోసం పడవల సాయంతో గాలింపు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 134 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 170 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.
పరిహారం
వంతెన కూలిన ఘటనపై కేసు నమోదు చేసిన గుజరాత్ సర్కార్ విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. గుజరాత్ సర్కార్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేల చొప్పున అందజేయనున్నట్లు తెలిపింది.