Morbi Bridge Collapses:


పెరిగిన మృతుల సంఖ్య..


గుజరాత్‌లో మోర్బి వంతెన కుప్ప కూలిన ఘటనలో మృతుల సంఖ్య 141కి పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. 100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. నదిలో పడిపోయి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జ్‌పై 500-700 మంది ఉన్నారని అంచనా. అసలు ఇంత మంది వంతెనపైకి వెళ్లటాన్ని మేనేజ్‌మెంట్ ఎలా అనుమతించింది అన్నదే ఇక్కడ కీలకంగా చర్చకు వస్తున్న అంశం. నిజానికి..ఆ బ్రిడ్జ్ కెపాసిటీ 100 మంది మాత్రమే. అంత మంది ఒకేసారి వెళ్లడం వల్లే వంతెన కుప్ప కూలి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 


బ్రిడ్జ్ చరిత్ర ఇదీ..


మచ్చు నదిపై నిర్మించిన ఈ వంతెనది 140 ఏళ్ల చరిత్ర. గుజరాత్‌లో అతి ముఖ్యమైన పర్యాటక ఆకర్షణల్లో ఇదీ ఒకటి. రోజూ వందలాది మంది వచ్చి ఈ బ్రిడ్జ్‌ను సందర్శిస్తుంటారు. రిషికేష్‌లోని రామ్, లక్ష్మణ్ ఊయల వంతెనను పోలి ఉండటం వల్ల చాలా మంది దీన్ని చూసేందుకు వస్తుంటారు. ఒక్కోసారి పర్యాటకుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతుంది. ఆదివారం కావటం వల్ల నిన్న ఎక్కువ మంది వచ్చారు. వందల మంది వంతెనపైకి ఎక్కారు. కెపాసిటీకి మించి పోవటం వల్ల ఉన్నట్టుండి అది కూలిపోయింది. వంతెనపై ఉన్న వాళ్లంతా నదిలో పడిపోయారు. కొందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినా...కొందరు మాత్రం గల్లంతయ్యారు. 


నిర్లక్ష్యమే కారణమా..?


ఈ బ్రిడ్జ్‌ను 1880లో నిర్మించారు. అప్పటి ముంబయి గవర్నర్ రిచర్డ్ టెంపుల్ దీన్ని ప్రారంభించారు. ఈ నిర్మాణానికి అప్పట్లోనే రూ.3.5 లక్షలు ఖర్చు చేశారు. ఇందుకు అవసరమైన సామగ్రి అంతా బ్రిటన్ నుంచి తెప్పించారు. నిర్మాణం పూర్తైనప్పటి నుంచి ఇప్పుడీ ప్రమాదం జరిగినంత వరకూ ఎన్నో సార్లు ఈ వంతెనకు మరమ్మతులు చేశారు. ఈ వంతెన ఎత్తు 765 అడుగులు, వెడల్పు 1.25 మీటర్లు, పొడవు 230 మీటర్లు. భారత స్వాతంత్య్రోద్యమానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది ఈ బ్రిడ్జ్. క్రమంగా ఇదో టూరిస్ట్ ప్లేస్‌గా మారిపోయింది. ఈ మధ్యే మరమ్మతుల కారణంగా దాదాపు 6 నెలల పాటు వంతెనను మూసివేశారు. అక్టోబర్ 25వ తేదీన బ్రిడ్జ్‌ను తెరిచారు. ఈ ఆర్నెల్లలో రూ.2 కోట్ల ఖర్చుతో వంతెనకు మరమ్మతులు చేయించారు. Oreva Group ఈ బ్రిడ్డ్ మెయింటేనెన్స్ చూసుకుంటోంది. మోర్బి మున్సిపాలిటీతో ఈ సంస్థ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. 2022 నుంచి 2037 వరకూ 15 ఏళ్ల పాటు మెయింటేన్ చేసేలా అగ్రిమెంట్ కుదురింది. జిందాల్ గ్రూప్ బ్రిడ్జ్‌కు  25 ఏళ్ల గ్యారెంటీ ఇచ్చినప్పటికీ...ఫిట్‌నెస్ సర్టిఫికేట్ మాత్రం ఇంకా రాలేదు. ఈలోగా దీపావళికిప్రారంభించాలన్న హడావుడిలో దాన్ని ఓపెన్ చేశారు. ఈ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అంటున్నారు. 


ప్రధాని దిగ్భ్రాంతి..


ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. హృదయాన్ని కలిచివేసిందని భావోద్వేగానికి గురయ్యారు. గుజరాత్ ప్రభుత్వంతో పాటు కేంద్రమూ కచ్చితంగా సహకరిస్తుందని వెల్లడించారు. ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఆర్మీతో పాటు ఎయిర్‌ఫోర్స్ కూడా వారికి సహకరిస్తోందని అన్నారు. "బాధిత కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను. నా మనసంతా బాధతో నిండిపోయింది" అని అన్నారు. 


Also Read: CBI KCR : ఆ మార్గాల్లో వస్తే సీబీఐని కేసీఆర్ కూడా అడ్డుకోలేరు - జీవో నెం.51 పవర్ ఎంత అంటే ?