Kerala Crime News: వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ ప్రేమ విషయంలో అబ్బాయి చాలా నిజాయితీగా ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి ప్రేమించడానికి మాత్రమే ఇతడు కావాలనుకుంది. పెళ్లి మాత్రం బాగా డబ్బు, ఉద్యోగం ఉన్న వాడినే చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు చూసిన సంబంధానికి ఓకే చెప్పింది. కానీ ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులకే అతడికి విషం పెట్టి చంపేసింది. అయితే ఈ అమ్మాయికి వివాహం జరిగితే మొదటి భర్త చనిపోతాడని ఆ జ్యోతిష్యుడు చెప్పడమే ఇందుకు కారణం అయింది. అందుకే కేవలం ప్రేమకు మాత్రమే వాడుకోవాలనకున్న ఆ అబ్బాయిని.. కుటుంబ సభ్యుల సాయంతో పెళ్లి చేసుకొని ఈ దారుణానికి పాల్పడింది. 


కేరళ తిరువనంతపురంలోని పరశాలలో నివసించే షారన్ ఈనెల 14వ తేదీన హత్యకు గురయ్యాడు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయని వివరించారు. తమిళనాడులోని రామవర్మంచిరలోని అతని ప్రేయసే తమ కుమారుడి మృతికి కారణం అని చెప్పగా.. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. 8 గంటల పాటు విచారించి విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. గ్రీష్మ, షారన్ లు చాలా కాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. షారన్ గ్రీష్మనే పెళ్లి కూడా చేసుకొని జీవితాంతం కలిసుండాలనుకున్నాడు. కానీ గ్రీష్మ మాత్రం అతడిని కాకుండా వేరే వాళ్లను పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే గ్రీష్మ తల్లిదడ్రులు ఆమెకు ఓ యువకుడితో పెళ్లి నిశ్చయం చేశారు. ఫిబ్రవరిలోనే పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. 


ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని.. ఆపై


ఈ వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ జ్యోతిష్యుడు... గ్రీష్మ మొదటి భర్త త్వరలోనే చనిపోతాడని తెలిపాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కుట్రకు పథకం పన్నారు. ఇన్నాళ్లూ గ్రీష్మ ప్రేమించిన షారన్ ను పెళ్లి చేసుకొని, ఆ తర్వాత అతడిని చంపేయాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే గ్రీష్మ, షారన్ ను ఓ చర్చిలో పెళ్లి చేసుకుది. ఆ తర్వాత కొంత కాలం అతడితో గడిపింది. అయితే ఈనెల 14వ తేదీన తమిళనాడులోని రామవర్మంచిర్ లో ఉన్న గ్రీష్మ ఇంటికి వెళ్లిన షారన్.. చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అక్కడ గ్రీష్మ, షారన్ లు జ్యూస్ తాగే పోటీ పెట్టుకున్నారు. అయితే షారన్ తాగే జ్యూస్ లో కాపర్ సల్ఫేట్ కలిపి ఇచ్చింది గ్రీష్మ. అది తాగిన షారన్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషం తాగిన కారణంగానే షారన్ మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. 


విషం కలిపిన జ్యూస్ తాగడం వల్లే షారన్ మృతి


ఈ విషయాన్ని రుజువు చేసేలా గ్రీష్మ, షారన్ మధ్య వాట్సాప్ చాటింగ్ లు లభించాయి. అమ్మాయితో బయయటకు వెళ్లిన ప్రతీసారి షారన్ కు కడుపు నొప్పి వచ్చేదని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. వారిద్దరూ కలిసిన ప్రతీ సారి షారన్ కు విషం కలిపిన జ్యూస్ ఇచ్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు వివరించారు.