Gujarat HC Slams Bhupendra Patel:


పరిహారం చాలదు: హైకోర్టు


గుజరాత్‌లో మోర్బి వంతెన కూలిన ఘటనలో 135 మంది మృతి చెందారు. వీరి కుటుంబాలకు పరిహారం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే...చాలా తక్కువ మొత్తం వారికి అందిందని తెలుస్తోంది. దీనిపై గుజరాత్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. భూపేంద్ర పటేల్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. "సరైన పరిహారం అందజేయడం అత్యవసరం" అని వ్యాఖ్యానించింది. "తీవ్రంగా గాయ పడిన వారికి ఇచ్చిన ఆ పరిహారం కూడా చాలనే చాలదు" అని స్పష్టం చేసింది. పరిహారం అందజేసే విషయంలో ప్రభుత్వం విధానమేంటో స్పష్టంగా ఓ అఫిడవిట్‌ రూపంలో కోర్టుకి సమర్పించాలని చెప్పింది. అక్టోబర్ 30న ఈ ప్రమాదం జరగ్గా..ఆ రోజే ప్రభుత్వం మృతుల కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు సీఎం భూపేంద్ర పటేల్. గాయపడిన వారికి వైద్యం ఖర్చుల కోసం రూ.50,000 అందజేస్తామని చెప్పారు. అయితే...ఈ పరిహారం ఎంత మాత్రం చాలదని గుజరాత్ హైకోర్ట్ వ్యాఖ్యానించింది.  అంతే కాదు. రాష్ట్రంలోని అన్ని బ్రిడ్జ్‌లు సరిగా ఉన్నాయో లేదో సర్వే చేపట్టాలని ఆదేశించింది. 


ఫోరెన్సిక్ ల్యాబ్‌ రిపోర్ట్‌..


ఇటీవల ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్‌లో ఈ ఘటనకు సంబంధించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదం జరిగిన రోజు...బ్రిడ్జ్‌ను మెయింటేన్ చేసే Oreva Group 3వేలకు పైగా టికెట్లు అమ్మినట్టు తేలింది. అక్టోబర్ 30వ తేదీనే దాదాపు 3,165 టికెట్లు విక్రయించినట్టు లెక్కలు చెబుతున్నాయి. టికెట్ బుకింగ్ ఆఫీస్‌కి, సిబ్బందికి ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. కేవలం 125 మందిని మాత్రమే మోయగలిగే బ్రిడ్జ్‌పైకి 250-300 మంది వెళ్లేందుకు అనుమతినిచ్చారు. ఆ బరువు తట్టుకోలేక కేబుల్స్ తెగిపోయాయి. ఉన్నట్టుండి జనమంతా నీళ్లలోకి పడిపోయారు. కొందరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగినా...ప్రాణనష్టం మాత్రంబాగానే జరిగింది. 


సుప్రీం ఆదేశాలు..


గుజరాత్ మోర్బి కేసుపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ కేసులో విచారణ ఎలా జరుగుతోందో పరిశీలించాని గుజరాత్ హైకోర్టుకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన మిగతా అన్ని వివరాలపైనా దృష్టి సారించాలని తేల్చి చెప్పింది. అడ్వకేట్ విశాల్ తివారీ వేసిన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం...ఈ వ్యాఖ్యలు చేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌, జస్టిస్ హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం...పూర్తి బాధ్యతను గుజరాత్ హైకోర్టుకే అప్పగించింది. ఇలాంటి ప్రమాదాలు ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు అడ్వకేట్ విశాల్. నవంబర్ 1న అత్యవసర పిటిషన్‌ల జాబితాలో దీన్ని చేర్చారు. త్వరలోనే విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు అప్పుడే హామీ ఇచ్చింది. "దాదాపు దశాబ్ద కాలంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం, పనిపై శ్రద్ధ లేకపోవడం లాంటి కారణాల వల్ల పెద్ద ఎత్తున ప్రాణనష్టం వాటిల్లుతోంది. వీటిని తప్పకుండా అరికట్టాల్సిందే" అని పిటిషన్‌లో ప్రస్తావించారు. 


Also Read: Watch Video: ఇయర్ ఫోన్స్ ఆర్డర్ చేస్తే అంతా "బిస్కెట్" అయింది - వైరల్ వీడియో