Nellore Court Robbery Case: నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసుపై ఏపీ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే త్వరలోనే సీబీఐ ఈ కేసు దర్యాప్తును ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్ 13వ తేదీన నెల్లూరు 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో దొంగతనం జరిగింది. ఓ కీలక కేసులో సాక్ష్యాధారాలుగా ఉన్న కొన్ని డాక్యుమెంట్లు, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్టు తెలుస్తోంది. దీనిపై నెల్లూరు చిన్నబజారు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.  


ఆ తర్వాత ఏపీ హైకోర్టు ఈ కేసును సుమోటో పిల్ గా విచారణకు స్వీకరించింది. ఈ దొంగతనం కేసులో పోలీసుల దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని.. అందుకే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తే మంచిదని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఓ నివేదిక ఇచ్చారు. అప్పుడే వాస్తవాలు బయటపడతాయని వివరించారు. దీని ఆధారంగానే సుమోటో పిల్ గా పరగణించి... మొత్తం 18 మందిని ఏపీ హైకోర్టు ప్రతివాదులుగా చేర్చింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అప్పటి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశారు. సోమిరెడ్డికి విదేశాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయని.. కొన్ని పత్రాలను మీడియాకు విడుదల చేశారు. 


అయితే స్పందించిన చంద్రమోహన్ రెడ్డి.. కాకాణిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. కాకాణి విడుదల చేసిన డాక్యుమెంట్లు నకిలీవని ఛార్జీషీట్ ఫైల్ చేశారు. ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ లో నెల్లూరులోని కోర్టులో చోరీ జరిగింది. నెల్లూరు 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో దొంగతనం జరిగింది. ఓ కీలక కేసులో సాక్ష్యాధారాలుగా ఉన్న కొన్ని డాక్యుమెంట్లు, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్టు తెలుస్తోంది. దీనిపై నెల్లూరు చిన్నబజారు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.  


కోర్టులోనే దొంగతనం..


దొంగతనానికి గురైన సంచిని కోర్టు బయట ఉన్న కాలువలో గుర్తించిన పోలీసులు పరిశీలించారు. ఆ సంచిలో ఉండాల్సిన పలు కీలక డాక్యుమెంట్లు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే విచారణ చేపట్టారు. కోర్టు ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో దొంగల జాడ గురించిన సమాచారం కష్టతరంగా మారింది. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. కీలకమైన ఆధారాల కోసమే దొంగతనం జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. నెల్లూరు నగరంలోని ఖుద్దూస్ నగర్‌కు చెందిన సయ్యద్ హయత్, పొర్లుకట్టకు చెందిన ఖాజా రసూల్ ఈ చోరీలకు పాల్పడ్డట్టు తెలిపారు. అయితే నిందితులు మొదట ప్లాన్ తో రెక్కీ నిర్వహించి చోరీకి సిద్ధమయ్యారన్నారు. కోర్టు ప్రాంగణంలో నిర్మాణం జరుగుతున్న ప్రదేశం నుంచి సామగ్రి చోరీ చేసేందుకు వెళ్లారన్నారు. అయితే ఆ సమయానికి అక్కడ కుక్కలు గట్టిగా అరస్తూ వెంబడించడంతో, వాటి నుంచి తప్పించుకునేందుకు కోర్టు తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారన్నారు.