Monkeypox Cases India: దేశంలో మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా దిల్లీలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. 31 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది.






అదే ఆందోళన


దిల్లీలో మంకీపాక్స్ సోకిన వ్యక్తి ఎటువంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని తేలింది. జ్వరం, శరీరంపై పొక్కులు రావడంతో బాధితుడు డాక్టర్లను సంప్రదించాడు. ప్రస్తుతం అతడికి మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు.


దేశంలో గతంలో మంకీపాక్స్‌ బారిన పడిన ముగ్గురూ కేరళకు చెందినవారే. వీళ్లు సౌదీ అరేబియా, దుబాయ్ వంటి దేశాలకు వెళ్లి తిరిగి వచ్చాక వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. అయితే దిల్లీలో మంకీపాక్స్ సోకిన వ్యక్తికి ఎలాంటి ఫారెన్ ట్రావెల్ హిస్టరీ లేదు.


లక్షణాలు ఎలా ఉంటాయి?


మంకీపాక్స్ మశూచిని పోలి ఉంటుంది. ఇది ఆఫ్రికాలోని పశ్చిమ దేశాల్లో, మధ్య దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రారంభ దశలో జలుబుగా ఎక్కువమంది భావిస్తారు. ఇది తీవ్రంగా మారినప్పుడు చర్మంపై ఎర్రటి దద్దుర్లు పెరగిపోతాయి. ప్రారంభదశలో కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి. 


1. తలనొప్పి
2. జ్వరం
3. వెన్ను నొప్పి
4. కండరాల నొప్పి
5. చలి
6. అలసట


అమ్మవారిలాగే...


చికెన్ పాక్స్‌ను మన దగ్గర అమ్మవారు అని పిలుచుకుంటారు. దాదాపు అందులో కనిపించే లక్షణాలే మంకీ పాక్స్ వైరస్ సోకినప్పుడు కూడా కనిపిస్తాయి. అరచేతులు, అరికాళ్లపై అధికంగా దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. అమ్మవారు సోకినా కూడా తీవ్ర జ్వరం ఉంటుంది. మంకీ పాక్స్ సోకినా తీవ్ర జ్వరం కనిపిస్తుంది.


Also Read: Covid Monkeypox: ఆ వ్యక్తికి ఒకేసారి కొవిడ్, మంకీపాక్స్- చరిత్రలో ఇదే తొలిసారి!



Also Read: Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తిని అడ్డుకోవడం ప్రజల చేతుల్లోనే ఉంది, ఇలా చేస్తే ఆ వ్యాధి వ్యాపించదు