ఇప్పటికే కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరో మహమ్మారి ప్రపంచంపై విరుచుకుపడింది. ఆఫ్రికాలో మొదలైన ఈ మంకీ పాక్స్ దేశాలను దాటుతూ ప్రపంచం వ్యాప్తంగా పాకిపోతోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని గ్లోబల్ హెల్త్ ఎమెర్జెన్సీగా ప్రకటించింది. వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి పౌరులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మనదేశంలో ఇప్పటివరకు దాదాపు మూడు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ ప్రయాణాికుల కోసం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. మంకీపాక్స్ గాలి ద్వారా, నీటి ద్వారా వ్యాపించదు, దాన్ని అడ్డుకోవడం ప్రజల చేతుల్లోనే ఉంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంకీపాక్స్ ను అడ్డుకోవచ్చు.
1. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లను ఇంట్లో వాడండి. మీ చేతులను శుభ్రంగా వాష్ చేసుకోండి.
2. మంకీపాక్స్ తో బాధపడుతున్న వారు వాడిన పాత్రలను, దుస్తులను మీరు వాడద్దు. మీ కుటుంబసభ్యుల్లో ఎవరికైన వచ్చి ఉంటే వారిని ఒక గదిలోనే ఉంచి అది తగ్గేవరకు సామాజిక దూరం పాటించండి.
3. మంకీ పాక్స్ వచ్చిన వారి చేతులపై, శరీరంపై దద్దుర్లు వస్తాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో తాకవద్దు.
4. మంకీపాక్స్ రోగులను తాకవద్దు. ఎందుకంటే ఈ వ్యాధి స్కిన్ టు స్కిన్ సంబంధాన్ని కలిగి ఉంటే వ్యాపిస్తుంది.
5. ముఖ్యంగా వారితో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకోవద్దు. సెక్స్ లో పాల్గొనడాన్ని నివారించండి.
6. మంకీపాక్స్ ఉందేమో అన్న అనుమానం వచ్చినా కూడా వారి దుస్తులను, టవల్ ను ముట్టుకోవద్దు.
7. చనిపోయిన జంతువులు కళేబరాలు కూడా మంకీపాక్స్ వాహకాలుగా మారతాయి. కాబట్టి వాటిని కూడా తాకవద్దు.
ఇప్పటివరకు కేరళలోనే మూడు మంకీ పాక్స్ కేసులను గుర్తించారు. వారంతా విదేశాల నుంచి వచ్చిన వారే. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఆరు వేల మందికి మంకీ పాక్స్ సోకింది. వారిలో ముగ్గురు మరణించారు. మంకీ పాక్స్ సోకిన వారిని కూడా ఐసోలేషన్లో ఉంచాల్సిన అవసరం ఉంది. అందుకే హైదరాబాద్ లోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో 36 పడకలతో మంకీ పాక్స్ ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో మంకీ పాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే విమానాశ్రయం నుంచి ఈ ఐసోలేషన్ వార్డుకు తరలిస్తారు.
Also read: పిల్లల లంచ్ బాక్స్‌కు మంచి రెసిపీ ‘బిసిబెళ బాత్’, ఇలా చేస్తే అదిరిపోతుంది
Also read: ఈ కిలో మామిడి పండ్ల ధరకు చిన్న కారు కొనేసుకోవచ్చు, కాస్ట్లీయే కాదు టేస్టులో కూడా టాపే
Also read: రొమ్ముక్యాన్సర్ ఆడవారికే వస్తుందనుకుంటే మీ భ్రమే, మగవారికీ వచ్చే ఛాన్స్, లక్షణాలు ఇలా ఉంటాయి