National Mango Day: తియ్యటి మామిడి పండ్లు... తలచుకుంటేనే నోరూరిపోతుంది కదూ. అందులోనూ మియాజాకి మామిడిపండ్లు తింటే జీవితంలో వాటి రుచిని మర్చిపోలేరు.ఇవి మనదేశానికి కాదు. మొన్నటి వరకు మన దగ్గర పండలేదు కూడా. ఇప్పుడు మాత్రం మధ్యప్రదేశ్లోని జబల్ పూర్లో మియాజాకి పండ్లను ఓ వ్యక్తి పండిస్తున్నారు. కిలో ఎంతో తెలుసా? దాదాపు మూడు లక్షల రూపాయలు. అంటే చిన్న సైజు కారు కొనేసుకోవచ్చు. కిలో పండ్లు కావాలో, కారు కావాలో మీరే నిర్ణయించుకోండి. ఆహార ప్రియులు మాత్రం కచ్చితంగా పండ్లనే ఎంచుకుంటారు.
జపాన్లో ఉండాల్సిన మియాజాకి పండ్లు మనదేశంలోని జబల్ పూర్ కు ఎలా చేరాయి? అంటే సంకల్ప్ అనే వ్యక్తి ఓ రోజు చెన్నైకి రైలులో వెళుతుండగా, ఆ రైల్లోనే కలిసిన ఓ వ్యక్తి రెండు మామిడి మొక్కలను ఇచ్చాడు. ఆ మొక్కలను ఇస్తూ ‘వీటిని మీ పిల్లల్లా పెంచండి’ అని చెప్పాడు. అతను అప్పుడలా ఎందుకు చెప్పాడో సంకల్ప్ కు అర్థం కాలేదు. అవి ఏ జాతి మామిడి పండ్లో తెలియకపోయినా తోటలో నాటాడు. అవి పెరిగి పెద్దయి, కాయలు కాశాక అర్థమైంది వాటి విలువ. గతేడాది నుంచే కాయలు కాయడం మొదలుపెట్టాయి చెట్లు. అవి చాలా విలువైన, ఖరీదైన జాతి మామిడిపండ్లని, జపాన్లో మాత్రమే పండుతాయని తెలిసింది. వాటిని కాపాడుకునేందుకు నలుగురు కాపలదారులను, ఆరు కుక్కలను ఏర్పటు చేశారు. వీరంతా కాపలాకాయాల్సింది తోటకు కాదు, రెండు మియాజాకి పండ్ల చెట్లకు మాత్రమే.
మామిడి పండ్ల నిజాలు
1. మనదేశంలో మామిడి పండ్లను 5000 ఏళ్ల క్రితం నుంచి పండిస్తున్నారు.
2. బాగా పండిన మామిడిపండులో 14 శాతం చక్కెర ఉంటుంది.
3. మామిడిపండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. బీటాకెరాటిన్ అధికంగా ఉంటుంది.
4. ఇది సీజనల్ ఫ్రూట్. ప్రతి వేసవిలో వచ్చే ఈ పండును కచ్చితంగా తినాల్సిందే.
5. మామిడిపండ్లను పండించే అతి పెద్ద దేశం మనదే. దాదాపు 50 శాతం ఎగుమతులు భారత్ నుంచే ఉంటాయి. ఏడాదికి 18 మిలియన్ టన్నులు ఉత్పత్తి అవుతాయి.