Bundelkhand Expressway: 


పెద్ద మనుషులు వచ్చి ప్రారంభించిన రోడ్డు ఇది: అఖిలేష్ యాదవ్


ప్రధాని మోదీ ఇటీవలే ప్రారంభించిన యూపీలోని బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే భారీ వర్షాలకు దెబ్బ తింది. ఓ ప్రాంతంలో పూర్తిగా కుంగిపోయింది. దాదాపు ఒకటిన్నర అడుగు లోతుకు కూరుకుపోయింది. వారం క్రితమే ప్రధాని మోదీ ఈ రోడ్‌ను ప్రారంభించారు. అప్పుడే రోడ్డు పాడైపోవటంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ డ్యామేజ్ కారణంగా రెండు కార్లు, ఓ బైక్‌కు యాక్సిడెంట్‌కు గురయ్యాయని స్థానిక మీడియా వెల్లడించింది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ రోడ్ డ్యామేజ్‌కు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. భాజపాపై విమర్శలు గుప్పించారు. "భాజపా ఏ పనైనా అన్యమనస్కంగా చేస్తుందనటానికి ఇదే నిదర్శనం. పెద్ద మనుషులు వచ్చి ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు. వారం రోజుల్లోనే ఇందులోని అవినీతి ఏంటో బయటపడింది. దీనిపైన రన్‌వేలు నిర్మించకపోవటం మంచిదైంది" అని ట్వీట్ చేశారు అఖిలేష్ యాదవ్. తరవాత ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా స్పందించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని మోదీపై విమర్శలు చేసింది.









 


ప్రతిష్ఠాత్మక రహదారిలో ఎందుకిలా? 


ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు స్పందించారు. రోడ్డు కుంగిపోలేదని, నీళ్లు నిలిచిపోవటం వల్ల కాస్త పాడైందని వివరించారు. మరమ్మతు పనులు పూర్తయ్యాయని, ట్రాఫిక్ కూడా క్లియర్ అయిందని వెల్లడించారు. రిపేర్ జరుగుతున్న సమయంలోనే ఎవరో వీడియో తీసి వైరల్ చేశారని చెప్పారు. ఈ 296 కిలోమీటర్ల ఫోర్ లేన్ రహదారి నిర్మాణానికి రూ.14,850 కోట్లు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఎక్స్‌ప్రెస్‌ వేతో స్థానికంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవటమే కాకుండా కనెక్టివిటీ కూడా పెరగనుంది. చిత్రకూట్‌ను లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానించే ఈ నాలుగు వరుసల రహదారికి 2020 ఫిబ్రవరి 29న ఫౌండేషన్ స్టోన్‌ వేశారు ప్రధాని మోదీ. ఉత్తర్‌ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ వేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ(UPEIDA) నేతత్వంలో ఈ రహదారి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతానికి 4 లేన్ హైవే అయినప్పటికీ...భవిష్యత్‌లో దీన్ని ఆరు వరుసలకు విస్తరించాలని చూస్తున్నారు. రహదారి భద్రత విషయంలోనూ ఏ మాత్రం వెనకాడకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)ను అందుబాటులో ఉంచుతారు. వీరితో పాటు పోలీసులు కూడా అందుబాటులో ఉంటారు. ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఈ రహదారి నిర్మాణంలో లోపాలు బయటపడటమే చర్చనీయాంశమైంది.