కేజీ ఉప్పు కొనడం చాలా సులువు. ఇరవై రూపాయలు పెడితే వచ్చేస్తుంది. అందులోనూ భూమ్మీద నేల కన్నా సముద్రమే ఎక్కువ. కాబట్టి ఉప్పుకు లోటెందుకు వస్తుంది? అందుకే మనం ఉప్పు గురించి ఎక్కువ ఖర్చుపెట్టము. ఇక హిమాలయన్ పింక్ సాల్ట్ కొనాలంటే రెండు వందల రూపాయలలోపే ఉంటుంది. కాబట్టి అది కూడా పెద్ద ఖరీదు కాదు. కానీ ప్రపంచంలోనే అతి ఖరీదైన ఉప్పు ఉంది. దాన్ని కొనాలంటే మాత్రం మధ్యతరగతి వారు తమ నెలజీతాన్ని ఖర్చుపెట్టాల్సిందే. అవును దీని పేరు ‘బాంబూ సాల్ట్’. తెలుగులో వెదురు ఉప్పు అని పిలుచుకోవచ్చు. ఈ ఉప్పు కిలో ధర రూ.30,000 దాకా ఉంటుంది. దీని ధర ప్రతి ఏటా ఇంకా పెరుగుతుందే కానీ తరగదు.
ఏంటి ప్రత్యేకత?
బాంబూ చికెన్, బాంబూ బిర్యానీలాగే బాంబూ ఉప్పు కూడా చాలా స్పెషల్. దీన్నే పర్పుల్ సాల్ట్ అని కూడా పిలుచుకుంటారు కొన్ని ప్రాంతాల్లో. ఇది కొరియన్ వంటకాల్లో చాలా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. దీన్ని కొరియన్లు అధికంగా వాడతారు. కొన్ని వందల ఏళ్ల నుంచి వారి సంప్రదాయ ఆహారంలో ఔషధాల తయారీలో వెదురు ఉప్పు భాగమైపోయింది. దీన్ని తయారు చేసే విధానం చాలా భిన్నంగా ఉంటంది. అందుకే మిగతా ఉప్పులతో పోలిస్తే దీనికి ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి.
ఎలా తయారుచేస్తారు?
సముద్రపు నీరు నుంచి తయారుచేసిన ఉప్పుడును వెదురు బొంగుల్లో వేసి నింపుతారు. బొంగు రెండువైపులను బంకమన్నుతో మూసేస్తారు. ఆ బొంగులును మంటల్లో వేస్తారు. అత్యధికంగా 800 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు. వెదురు నుంచి వచ్చే నూనె, రసాలతో ఉప్పు కలిసిపోతుంది. వాటిలోని పోషకాలు కూడా ఉప్పుకు పడతాయి. దీని వల్ల ఉప్పు మరింత సుగుణాలు, పోషకాలతో నిండిపోతుంది. ఇలా అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల 14 గంటల పాటూ కాలుస్తారు. దీంతో వెదురు బొంగు బొగ్గులా కాలిపోతాయి. లోపలి ఉప్పు మాత్రం ముద్దలా తయారవుతుంది. దాన్ని తీసి శుభపరిచి మళ్లీ పొడిలా చేస్తారు. మళ్లీ దాన్ని వేరే వెదురుబొంగులో నింపి మళ్లీ కాలుస్తారు. ఇలా అనేక సార్లు చేయడం వల్ల ఉప్పు రంగు కూడా మారిపోయి బ్రౌన్ రంగులోకి మారిపోతుంది. చివరికి గట్టి రాయిలా తయారవుతుంది ఉప్పు. దాన్ని పొడిలా చేసి ‘బాంబూ సాల్ట్’ పేరుతో అమ్ముతారు. దీని తయారు చేయడానికి దాదాపు 40 నుంచి 45 రోజులు పడుతుంది. అంతా మనుషులే స్వయంగా చేస్తారు. ఈ ఉప్పు తయారీలో ఎక్కడా మెషీన్లను ఉపయోగించరు.ఈ ఉప్పుకు చాలా డిమాండ్ ఉంటుంది.
ఆరోగ్యానికెంతో మంచిది
ఈ ఉప్పు ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. దీన్ని తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని వారి నమ్మకం. చర్మసమస్యలు కూడా తగ్గుతాయని అంటారు. జీర్ణక్రియకు ఇది ఎంతో మేలు చేస్తుందని నమ్మకం. క్యాన్సర్ ను అడ్డుకునే లక్షణాలు కూడా దీనిలో ఉన్నాయని నమ్ముతారు. ఈ ఉప్పులో కేవలం సోడియం మాత్రమే కాదు వెదురు నుంచి పొందిన ఇనుము, కాల్షియం, పొటాషియం కూడా అధికంగా ఉంటాయని నమ్ముతారు.
Also read: మంకీపాక్స్ వ్యాప్తిని అడ్డుకోవడం ప్రజల చేతుల్లోనే ఉంది, ఇలా చేస్తే ఆ వ్యాధి వ్యాపించదు
Also read: ఈ కిలో మామిడి పండ్ల ధరకు చిన్న కారు కొనేసుకోవచ్చు, కాస్ట్లీయే కాదు టేస్టులో కూడా టాపే