Rains In Telangana: నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నేటి నుంచి మరో 4 రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. జూలై 27 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఉత్తర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ అలర్ట్ జారీ చేయగా, కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. ఏపీలోని గుంటూరు, కృష్ణా జిల్లాలకు సైతం ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. బలపడిన రుతుపవన ద్రోణి ఇప్పుడు గంగానగర్, రోహ్తక్, గ్వాలియర్, సిధి, అంబికాపూర్, సంబల్పూర్, బాలాసోర్ మరియు ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ప్రయాణిస్తోంది. 


అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టంపై 0.9 కి.మీ వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు జార్ఖండ్, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఉత్తర ఒడిశా, పరిసర ప్రాంతాలపై ఉండగా.. సగటు సముద్ర మట్టంపై 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రానున్న మూడు నుంచి 5 రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.






తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
తెలంగాణలో మరో 4 రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం .. ఆదిలాబాద్ కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో మిగతా జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ప్రజలు అత్యవసరమైతే తప్ప, ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేటి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురవనున్నాయని ఈ 5 ఉమ్మడి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్ష సూచన ఉంది. 






దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్ష సూచనతో ఉమ్మడి గుంటూరు, కృష్ణా ఉమ్మడి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. మిగతా జిల్లాల ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని, మూడు రోజులు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
 


హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.