Covid Monkeypox: కరోనా వైరస్‌ (Coronavirus)తో కలవరపడుతోన్న ప్రపంచ దేశాలను మంకీపాక్స్ (Monkeypox) గడగడలాడిస్తోంది. తాజాగా మంకీపాక్స్ కేసులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ 75 దేశాలకు వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర స్థితిని ప్రకటించింది. అయితే ఇలాంటి సమయంలో కరోనా సోకిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ వచ్చింది. ఇలా జరగడం ఇదే తొలిసారని వైద్యులు చెబుతున్నారు.


అమెరికాలో


అమెరికా కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి జూన్‌ చివరి వారంలో కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పితో బాధపడుతోన్న ఆయనకు శరీరంపై దద్దుర్లు, ఎరుపు రంగులో పొక్కులు రావడం మొదలైంది. దీంతో అనుమానించిన ఆ వ్యక్తి వెంటనే వైద్యులను సంప్రదించాడు.


పరీక్షించిన వైద్యులు అవి మంకీపాక్స్‌ లక్షణాలుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే, ఇలా రెండు వైరస్‌లు ఒకేసారి సోకడం చాలా అరుదైన కేసు అని వీటిపై మరింత పరిశీలన అవసరమని వైద్యులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే అమెరికా ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 


డేంజర్ బెల్స్






ఇప్పటికే 75 దేశాలకు మంకీపాక్స్ వ్యాపించింది. ముఖ్యంగా మంకీపాక్స్‌ కేసుల్లో దాదాపు 95 శాతానికిపైగా కేసులు స్వలింగ సంపర్కుల్లోనే వస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 16 వేల కేసులు నమోదుకాగా ఐదుగురు చనిపోయారు. 


దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం కావాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. మంకీపాక్స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించింది. ప్రజలు కూడా ఏమాత్రం అలసత్వం పాటించవద్దని కోరింది.


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 20 వేల కరోనా కేసులు- 36 మంది మృతి


Also Read: Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తిని అడ్డుకోవడం ప్రజల చేతుల్లోనే ఉంది, ఇలా చేస్తే ఆ వ్యాధి వ్యాపించదు