Monkeypox Case: 


చికిత్స తీసుకున్న తరవాత ఆరోగ్యంగా ఉన్నాడు: కేరళ ఆరోగ్య శాఖ  


భారత్‌లో ఇప్పటికే మంకీపాక్స్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే నలుగురు ఈ వైరస్ బారిన పడ్డారు. కేరళలోనే మూడు కేసులు నమోదయ్యాయి. కొల్లంకు చెందిన 35 ఏళ్ల వ్యక్తి భారత్‌లో మంకీపాక్స్‌ తొలి బాధితుడు. ఇప్పుడా వ్యక్తి పూర్తిగా కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్చ్‌ అయినట్టు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జ్ వెల్లడించారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందిన బాధితుడు, ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. జులై 12వ తేదీన యూఏఈ నుంచి వచ్చాడు ఈ బాధితుడు. జులై 14వ  తేదీన మంకీపాక్స్ లక్షణాలు కనిపించటం వల్ల టెస్ట్ చేయించుకోగా..పాజిటివ్‌గా నిర్ధరణైంది. అప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దాదాపు 15 రోజుల తరవాత మరోసారి టెస్ట్ చేయగా...నెగటివ్‌గా తేలింది. "బాధితుడు ఇప్పుడు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడు. దద్దర్లు కూడా పూర్తిగా తగ్గిపోయాయి" అని వైద్యులు తెలిపారు. ఇక కేరళకు చెందిన మరో ఇద్దరు బాధితులు పూర్తిగా కోలుకోకపోయినా..వారి ఆరోగ్యం మెరుగవుతోందని ఆరోగ్య శాఖ తెలిపింది. వరుసగా మంకీపాక్స్ కేసులు నమోదు కావటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ కట్టడికి అవసరమైన చర్యలు ప్రారంభించింది. 


ఆ శాంపిల్స్‌ అన్నీ నెగటివే..


భారత్‌లోనూ మంకీపాక్స్‌ కేసుల విషయంలో కాస్త ఊరట కలిగించే విషయాలే వెల్లడవుతున్నాయి. మహారాష్ట్రలోని పుణేలో ఉన్న నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో మంకీపాక్స్ అనుమానిత సాంపిల్స్‌ని టెస్ట్ చేశారు. అందులో 10 నమూనాలు పరీక్షించగా, 9 సాంపిల్స్‌ మంకీపాక్స్‌ నెగటివ్‌గా నిర్ధరణైంది. నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు ఈ విషయం వెల్లడించారు. మరో సాంపిల్ రిజల్ట్స్‌ ఇంకా రావాల్సి ఉంది. గత నెలలో ఈ ఇన్‌స్టిట్యూట్‌కి శాంపిల్స్‌ పంపగా, ఇప్పుడు వాటి ఫలితాలు వెలువరించారు. అన్నీ మహారాష్ట్రకు చెందిన వారి శాంపిల్సే. అంటే...మహారాష్ట్రలో ఇప్పటి వరకూ ఒక్క మంకీపాక్స్ కేసు కూడా నమోదు కాలేదన్నమాట. అయితే ఈ శాంపిల్స్‌
ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది మాత్రం అధికారులు వెల్లడించలేదు. అనవసరమైన ఆందోళనలు పెంచకుండా ఉండేందుకే, ఇలా వివరాలు దాచి పెట్టారని తెలుస్తోంది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులందరిపైనా దృష్టి సారించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వైద్యులు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.


ఉన్నట్టుండి శరీరంపై దద్దుర్లు వచ్చినా, గత 21 రోజుల్లో ఎవరైనా విదేశాలకు వెళ్లొచ్చినా...అలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. "ఎక్కడి నుంచి ఇది వ్యాప్తి చెందింది, కాంట్రాక్ట్ ట్రేసింగ్ ఎలా చేయాలి, టెస్టింగ్ ఎలా నిర్వహించాలి" అనే అంశాలపై చర్చలు జరుగుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అప్రమత్తమైంది. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. కేసులు నమోదవుతున్న ఆయా దేశాలకు పలు సూచనలు చేసింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. 


Also Read: Fact Check Shinde : ఏక్‌నాథ్ ఆటో నడిపి ఉండవచ్చు కానీ ఆ ఫోటోలో ఉన్నది మాత్రం ఆయన కాదు - వైరల్ ఫోటో వెనుక అసలు నిజం ఇదిగో


Also Read: Watch: ఒకేసారి 30 వేల కిలోల డ్రగ్స్‌ తగలెట్టేశారు - అంతా కేంద్రమంత్రి సమక్షంలోనే