Mehbooba Mufti:


అక్రమ నిర్మాణాలు తొలగింపు..


జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మోదీ సర్కార్‌పై తరచూ ఏదో విమర్శలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు చేసిన తరవాత నుంచి ఆ విమర్శల దాడి మరింత పెరిగింది. ప్రస్తుతానికి కేంద్రం కశ్మీర్‌లోని అక్రమ నిర్మాణాలన్నింటినీ బుల్‌డోజర్లతో కూల్చి వేయిస్తోంది. దీనిపై మెహబూబా ముఫ్తీ అసహనం వ్యక్తం చేశారు. బుల్‌డోజర్లతో ఇల్లు కూల్చేస్తూ కశ్మీర్‌ను కూడా మరో అఫ్గనిస్థాన్‌లా మార్చే కుట్ర చేస్తున్నారంటూ మండి పడ్డారు. "బుల్‌డోజర్ల కారణంగా కశ్మీర్ అఫ్గనిస్థాన్‌లా కనిపిస్తోంది" అని అన్నారు. బీజేపీ పాలనలో కశ్మీర్‌ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బ తిందని విమర్శించారు. 


"రోడ్లపై ప్రజలు నిద్రపోవడం, ఫ్రీ రేషన్ కోసం పెద్ద పెద్ద క్యూలు కట్టి ఇబ్బందులు పడటం జమ్ముకశ్మీర్‌లో గతంలో ఎప్పుడూ జరగలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్న వారు కూడా దిగువకు వచ్చేశారు. క్రమంగా జమ్ముకశ్మీర్‌ను పాలస్తీనా, అఫ్గనిస్థాన్‌లా మార్చేస్తారేమో" 


మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం


జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత పాలన చూస్తుంటే...పాలస్తీనా, అఫ్గనిస్థాన్‌లోని పరిస్థితులు కాస్త నయంగా ఉన్నాయని అన్నారు. 


"పాలస్తీనా చాలా నయం. కనీసం అక్కడి ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. చిన్న చిన్న ఇళ్లను బుల్‌డోజర్లతో కూల్చేస్తున్నారు. ఆ పేద ప్రజల ఇళ్లు కూల్చేయడం ఎందుకు? "


మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం


రాజ్యాంగంపైనా దాడి: మెహబూబా ముఫ్తీ 


పేదల ఇళ్ల జోలికి వెళ్లమని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హామీ ఇచ్చారని, కానీ వాళ్ల ఇళ్లనూ కూల్చి వేస్తున్నారని చెప్పారు మెహబూబా. మోదీ సర్కార్ " ఒకే దేశం,ఒకే భాష, ఒకే మతం" అనే నినాదంతో అందరినీ అణిచివేస్తోందని విమర్శించారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలనూ బుల్‌డోజర్లతో తొక్కిస్తున్నారని అన్నారు. 


ఉగ్రవాదుల ఇళ్లు కూల్చివేత..


జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు కేంద్రం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే...అక్కడి అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే అనంత్‌నాగ్‌లోని పహల్‌గామ్‌లో హిజ్బుల్ ముజాహిద్దీన్ టెర్రరిస్ట్ కమాండర్ ఆమిర్ ఖాన్‌ ఇంటిని బుల్‌డోజర్‌తో పడగొట్టేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఈ ఇల్లు కట్టినట్టు అధికారులు వెల్లడించారు. "గులాం నబీ ఖాన్ అలియాస్ ఆమిర్ ఖాన్ ఇల్లు కూల్చేశాం. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలో ఆపరేషనల్ కమాండర్‌గా పని చేస్తున్నాడు. 1990ల్లో చాలా సార్లు పీఓకేని దాటుకుని వచ్చాడు. అక్కడి నుంచి ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే వాడు" అని తెలిపారు. అంతకు ముందు మరో ఉగ్రవాది ఇంటినీ కూల్చి వేశారు.  పుల్వామాలోని రాజ్‌పొరా ప్రాంతంలో ఉన్న జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఆశిక్ అహ్మద్ నెంగ్రూ అలియాస్ అంజీద్ భాయ్ ఇంటిని పడగొట్టారు. ఇది కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిందేనని అధికారులు చెప్పారు. అంజీద్‌పై ఎన్నో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. జమ్ముకశ్మీర్‌లో భద్రతపై రాజీ పడేదే లేదని ఇప్పటికే కేంద్ర హోం మంత్రి తేల్చి చెప్పారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరించాలని అధికారులకు స్పష్టం చేశారు.


Also Read: Earthquake Risk Zones: ఇండియాలోనూ భారీ భూకంపాలు తప్పవా? హై రిస్క్ జోన్‌లో ఆ నగరాలు