విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మధ్య మంచి అనుబంధం ఉండేది. ఆ అనుబంధం వాళ్ళ వారసుల మధ్య కూడా కొనసాగుతోంది. ఎన్టీఆర్ తనయుడు, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటించిన వందో సినిమా 'గౌతమి పుత్ర శాతకర్ణి'లో రాజ్ కుమార్ తనయుడు శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) అతిథి పాత్రలో నటించారు. ఇప్పుడు ఆయన హీరోగా నటించిన 'వేద' ప్రీ రిలీజ్ వేడుకకు బాలకృష్ణ అతిథిగా వచ్చారు.
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన 125వ సినిమా 'వేద'. తెలుగులో ఈ గురువారం (ఫిబ్రవరి 9న) థియేటర్లలో విడుదల అవుతోంది. కన్నడలో శివ రాజ్ కుమార్ భార్య గీత నిర్మించారు. తెలుగులో కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ పతాకంపై ఎంవిఆర్ కృష్ణ విడుదల చేస్తున్నారు. మంగళవారం రాత్రి హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. దానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. బిగ్ టికెట్ విడుదల చేసి సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ప్రజల గుండెల్లో పునీత్ చిరస్థాయిగా నిలుస్తాడు - బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ''వేద ట్రైలర్ చాలా బాగుంది. శివన్నతో ఈ దర్శకుడు హర్ష ఇంతకు ముందు 'బజరంగీ' వన్, టూ తీశాడు. పునీత్ హీరోగా 'అంజనీ పుత్ర' చేశాడు. ఇప్పుడీ 'వేద'ను కూడా చాలా బాగా తీశాడు. మాకు శివ రాజ్ కుమార్ ఫ్యామిలీతో ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. శివన్న, రాఘవేంద్ర, పునీత్... ముగ్గురు అన్నదమ్ములు. పునీత్ ఎన్నో మంచి పనులు చేశాడు. ఇప్పుడు అతను మన మధ్య శారీరకంగా లేకపోయినా... చేసిన మంచి పనుల కారణంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. 'వేద' సినిమాలో విజువల్స్, మ్యూజిక్, కంటెంట్ అన్నీ బావున్నాయి. కన్నడలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా హిట్ కావాలి'' అని చెప్పారు.
బాలకృష్ణతో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయాలనుంది - శివన్న
బాలకృష్ణ 'వేద' ప్రీ రిలీజ్ వేడుకకు రావడం పట్ల శివ రాజ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''బాలకృష్ణ గారి 100వ సినిమాలో నన్ను ఓ పాట చేయమని అడిగారు. చాలా సంతోషంగా చేశా. ఇప్పుడు పాట కాదు... ఆయనతో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ (సినిమా) చేయాలని ఉంది. దాని కోసం వెయిట్ చేస్తున్నాను'' అని చెప్పారు. ఎన్టీఆర్, ఏయన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ ఫ్యామిలీల మధ్య మంచి అనుబంధం ఎప్పటి నుంచో ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి తన నుంచి వచ్చే సినిమాలను తెలుగులో విడుదల చేస్తానని తెలిపారు. 'వేద'లో మంచి వినోదంతో పాటు సందేశం ఉందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఇది ఆకట్టుకునే చిత్రమని శివ రాజ్ కుమార్ తెలిపారు.
Also Read : 'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్‌కు పవర్ టచ్ - సూసైడ్, డిప్రెషన్‌పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్!
తెలుగులో సినిమాను విడుదల చేస్తున్న ఎంవిఆర్ కృష్ణ మాట్లాడుతూ ''కన్నడలో సూపర్ హిట్ అయిన 'వేద' చిత్రాన్ని శివ రాజ్ కుమార్ సహాయంతో జీ స్టూడియో వాళ్లను సంప్రదించి ఈ నెల 9న తెలుగులో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని అన్నారు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అని, ఎమోషనల్ డ్రామా కూడా ఉంటుందని చిత్ర దర్శకుడు హర్ష తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో శివ రాజ్ కుమార్ భార్య గీత తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఫిబ్రవరిలోనే 'పులి - మేక' వెబ్ సిరీస్ విడుదల - ఎప్పుడంటే?