Lakhimpur Bus Accident: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి గాయపడిన చిన్నారి పరిస్థితిని చూసి బోరున విలపించారు. ఆసుపత్రిలో చిన్నారిని చూసి తట్టుకోలేక ఏడ్చిన అధికారిణి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ జరిగింది
లఖింపుర్ ఖేరీలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరో 41 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిచించి చికిత్స అందిస్తున్నారు. 730 నంబర్ జాతీయ రహదారిపై బస్సు, మినీ ట్రక్ ఎదురెదురుగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దౌరాహా నుంచి లఖ్‌నవూ వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఐరా వంతెన మీద ఎదురుగా వస్తున్న మినీ ట్రక్ ఢీ కొట్టింది.
గాయపడిన వారిలో 12 మందిని లఖ్‌నవూలో ట్రామా సెంటర్‌కు తరలించారు. మిగితావారికి ఖేరీ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీంతో లఖ్‌నవూ డివిజనల్ కమిషనర్ రోషన్ జాకబ్ క్షతగాత్రులను చూసేందుకు ఆసుపత్రికి వచ్చారు.
తట్టుకోలేక
ప్రమాదంలో గాయపడిన ఓ చిన్నారి పరిస్థితిని చూసి ఆమె చలించిపోయారు. ఆ చిన్నారి తల్లితో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. కంటతడి పెట్టుకుంటూనే బాలుడిని ఆప్యాయంగా పరామర్శించారు. ఆ చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సంతాపం
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Also Read: Congress President Elections: కాంగ్రెస్ అధ్యక్ష రేసు నుంచి గహ్లోత్ ఔట్- సారీ చెప్పి తప్పుకున్న సీఎం