India's Place New World Order: ఉక్రెయిన్ యుద్ధం నుంచి తైవాన్ ఘర్షణ వరకు ఇలా సమస్య ఏదైనా, కరోనా సంక్షోభమైనా.. భారత్ స్పందించిన తీరు, సమస్యను డీల్ చేసిన విధానం చూసి ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయాయి. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం భారత్ స్థానం చాలా మెరుగైంది. బ్రిక్స్, ఎస్‌సీఓ, క్వాడ్ సహా పలు అంతర్జాతీయ వేదికల్లో భారత గళాన్ని ప్రపంచ దేశాలు చాలా నిశితంగా పరిశీలిస్తున్నాయి.
వైవిధ్య వేదికల్లో
రష్యా, చైనా, ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా సభ్య దేశాలుగా ఉన్న బ్రిక్స్‌లో భారత్ పాత్ర చాలా కీలకంగా ఉంది. అమెరికా సహా పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలకు దీటుగా బ్రిక్స్ ఏర్పాటైంది. అయితే ఓ దశాబ్దం తర్వాత భారత్.. నలుగురు సభ్యుల కూటమి అయిన క్వాడ్‌లో కూడా స్థానం సంపాదించింది. ఇలా వైవిధ్యమైన వేదికల్లో భారత్ స్థానం సంపాదించగలిగింది.
ఆ తర్వాత సెంట్రల్ ఆసియా నుంచి గల్ఫ్ వరకు, ఆఫ్రికా దేశాల నుంచి అమెరికా వరకు భారత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అమెరికాతో పోలిస్తే దౌత్య విధానంలో భారత్ చాలా మెరుగ్గా ఉంది. ఓ పక్క అమెరికాతో స్నేహంగా ఉంటూనే రష్యాతో బలమైన సంబంధాలను నడుపుతోన్న దేశం భారత్ మాత్రమే.
ప్రపంచంలో ఉన్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఆరో స్థానంలో ఉంది. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికంతో భారత్ ఈ స్థానంలో నిలిచింది. పాశ్చాత్య దేశాల సాంకేతికత, పరికరాలు, వస్తువలకు భారత్ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. దీంతో పాశ్చాత్య దేశాలు.. భారత్‌తో సంబంధాలు నెరపడానికి ఎప్పుడూ ముందు ఉంటూనే ఉన్నాయి.
ఆసియాలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు పాశ్చాత్య దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఆర్థికంగా, రక్షణ పరంగా భారత్ మరింత శక్తిమంతం కావాలని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయి. అందుకే క్వాడ్, మలబార్ విన్యాసాలతో చైనాను సవాల్ చేస్తున్నాయి.
ద్వైపాక్షిక సంబంధాలు
అంతర్జాతీయ వేదికలపైనే కాదు ఇతర దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల్లో కూడా భారత్ చాలా బలంగా ఉంది. అమెరికా, రష్యా, జపాన్, ఇంగ్లాండ్ సహా గల్ఫ్ దేశాలతో భారత్ దౌత్య సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు ఇటీవల కాలంలో మరింత బలోపేతమయ్యాయి.
ముఖ్యంగా కొవిడ్ సంక్షోభంలో భారత్ చూపిన తెగువ, దయా గుణం ప్రపంచ దేశాలను ప్రేరేపించింది. దాదాపు 100 దేశాలకు భారత్ ఉచితంగా కొవిడ్ మందులను పంపిణీ చేసింది.
21వ శతాబ్దం మొదటి దశాబ్దాంలో భారత్.. ప్రపంచ వేదికపై రష్యా, చైనా సరసన చేరింది. అదే సమయంలో అమెరికాతో తన వ్యూహాత్మక సంబంధాలను మరింతగా పెంచుకుంది. దీని వల్లే 2008లో ఇండో-యుఎస్ అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇది భారత్‌కు ఓ అతిపెద్ద వ్యూహాత్మక విజయం.
చైనాతో ఘర్షణ
చైనాతో గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్ వైపు మరిన్ని దేశాలు చేరాయి. బ్రిక్స్ దేశాలతో భారత్ బంధం బలోపేతమైంది. అమెరికా కూడా భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకుంది. ఐరోపా, ఆసియా దేశాలు కూడా భారత్‌తో మైత్రికి ముఖ్య స్థానం ఇచ్చాయి.
ఉక్రెయిన్ యుద్ధంతో
రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ తీసుకున్న స్టాండ్ కూడా ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా రష్యాను మన నుంచి దూరం చేయాలని అనుకున్న దేశాలకు భారత్ తెలియకుండానే షాకిచ్చింది. ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని, అందరూ నష్టపోతారని మోదీ అన్నారు. భారత్ మాత్రం శాంతి పక్షానే నిలుస్తుందని పునరుద్ఘాటించారు.
" రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ఏ ఒక్కరూ విజేతలు కారు. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆహార ధాన్యాలు, ఎరువుల కొరత కారణంగా ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ ప్రభావం అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలపై అధికంగా ఉంటుంది. ఏది ఏమైనా భారత్ మాత్రం శాంతి పక్షమే. "
-ప్రధాని నరేంద్ర మోదీ
ఇలా భారత్ తీసుకున్న నిర్ణయాలు, దౌత్య పరంగా జరిపిన చర్చలు.. మన దేశాన్ని ప్రపంచంలో, అంతర్జాతీయ వేదికలపై ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. భవిష్యత్తుల్లో భారత్.. ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: India’s Space Odyssey: ఆదిత్య L1 నుంచి చంద్రయాన్ 3, గగన్‌యాన్ వరకు- ఇస్రో భవిష్యత్తు మిషన్లు ఇవే!
Also Read: Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!