Bihar New CM: బిహార్ ముఖ్యమంత్రిగా జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) నేత నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ ఫాగూ చౌహాన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
మలుపులు తిరిగి
క్షణానికో మలుపు తిరిగిన బిహార్ రాజకీయం నితీశ్ ప్రమాణంతో క్లైమాక్స్‌కు చేరింది. రాజీనామా చేసిన ఒక్కరోజులోనే మళ్లీ సీఎం పీఠమెక్కారు నితీశ్. ఆర్జేడీ, కాంగ్రెస్ సహా 7 పార్టీలతో జట్టుకట్టి మరోసారి అధికారంలోకి వచ్చారు. మంగళవారం 164 మంది ఎమ్మెల్యేల జాబితాతో రాజ్‌భవన్‌కు వెళ్లి 7 పార్టీలతో కూడిన మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్‌కు తెలిపారు నితీశ్.
ఇదే రికార్డు
నితీశ్ కుమార్ 2005 నుంచి ఇప్పటివరకు మొత్తం 8 సార్లు బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఇన్ని సార్లు ముఖ్యమంత్రి అయినా ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచీ ప్రాతినిధ్యం వహించడం లేదు. శాసనమండలి సభ్యుడిగా ఉంటూ ఆయన సీఎంగా సేవలందిస్తూ వస్తున్నారు.
భాజపాకు ఝలక్
మిత్రపక్షం భాజపాకు ఝలక్ ఇచ్చి మరోసారి రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ)తో నితీశ్ కుమార్ జత కట్టారు. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్.. ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చారు. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ), కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాకూటమితో నితీశ్ నేతృత్వంలోని జేడీయూ జట్టు కట్టి మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీలతో కలిసి సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్.
పట్నాలో గవర్నర్ ఫాగూ చౌహాన్‌ను కలిసి మంగళవారం రాజీనామా లేఖ అందజేశారు నితీశ్ కుమార్. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలందరి ఏకగ్రీవ సూచన మేరకు ఇలా చేసినట్లు మీడియాతో చెప్పారు.
అనంతరం రాజ్‌భవన్ నుంచి నేరుగా రబ్రీ దేవి నివాసానికి వెళ్లారు నితీశ్ కుమార్. తేజస్వీ యాదవ్ సహా ఇతర ఆర్జేడీ నేతల్ని ఆయన కలిశారు. "2017లో ఏం జరిగిందో మర్చిపోదాం. ఇప్పుడు సరికొత్త అధ్యాయం ప్రారంభిద్దాం" అని ఆయన తేజస్వీ యాదవ్‌తో అన్నట్లు సమాచారం.
మళ్లీ గవర్నర్ వద్దకు
ఆ తర్వాత కాసేపటికి నితీశ్, తేజస్వీ కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు. తమకు సంఖ్యాబలం ఉందని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన పత్రాల్ని సమర్పించారు.
అంతకుముందు
జేడీయూ శాసనసభ్యులు, ముఖ్య నేతలతో నితీశ్ కుమార్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నితీశ్ కుమార్.. భాజపాతో దోస్తీకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారట. అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు తాము నితీశ్ కుమార్ వెంటే ఉంటామని.. ఎలాంటి నిర్ణయమైనా తీసుకోమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
చాలా కాలం నుంచి బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ఎన్‌డీఏ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2020 ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించి నితీశ్ అధికారంలోకి వచ్చినా.. మిత్రపక్షం భాజపాకి ఎక్కువ సీట్లు దక్కాయి. దీంతో నితీశ్‌పై ఆ పార్టీ పెత్తనం చెలాయిస్తుందనే ప్రచారం సాగింది. ఈ కారణంగా పలుమార్లు నితీశ్ కుమార్ అసహనానికి గురయ్యారు. దీంతో నితీశ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
బలాబలాలు
బిహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. అతిపెద్ద పార్టీ ఆర్‌జేడీకి అసెంబ్లీలో 80 స్థానాలు ఉన్నాయి. భాజపా 77, జేడీయూ 45, కాంగ్రెస్ 19 సీట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Also Read: India's Place New World Order: ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ తూటా వాడాలో భారత్‌కు మాత్రమే తెలుసు!
Also Read: India’s Space Odyssey: ఆదిత్య L1 నుంచి చంద్రయాన్ 3, గగన్‌యాన్ వరకు- ఇస్రో భవిష్యత్తు మిషన్లు ఇవే!