Digital Rupee: భారత్‌ తన సొంత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. డిజిటల్‌ కరెన్సీ రేసులో ఇప్పటికే కొన్ని దేశాలు ముందడుగు వేశాయి. ఆ జాబితాలో చేరేందుకు భారత్‌ రెడీ అవుతోంది. డిజిటల్ రూపాయికి సరైన ఆకృతిని అందించేందుకు విధాన నిర్ణేతలు కృషి చేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిజిటల్‌ రూపాయిని ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. డిజిటల్‌ రూపాయి బాధ్యతలను ఆర్బీఐ తీసుకుందని వివరించారు. తక్కువ ఖర్చుతోనే వీటిని విడుదల చేయొచ్చని వెల్లడించారు.


CBDC అంటే ఏమిటి?


డిజిటల్‌ రూపాయిని ఆర్బీఐ లీగల్ టెండర్‌గా గుర్తించింది. ఇది ఫియట్ కరెన్సీకి సమానం. ఫియట్ కరెన్సీని అత్యంత సులభంగా బదిలీ చేసుకోవచ్చు. ఇతర కరెన్సీల్లోకి మార్చుకోవచ్చు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ప్రస్తుత మన రూపాయి, డిజిటల్‌ రూపాయి వేర్వేరు కావు. భౌతిక రూపాయికి డిజిటల్‌ రూపమే సీబీడీసీ. క్రిప్టో కరెన్సీలా డిజిటల్‌ కరెన్సీ విలువ హెచ్చు తగ్గులకు లోనవ్వదు. 


సాధారణ కరెన్సీతో డిజిటల్ లావాదేవీలు చేపట్టడం, డిజిటల్ రూపాయితో లావాదేవీలు చేయడానికి మధ్య వ్యత్యాసం ఉంది. భీమ్‌, గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం వంటి యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వేదికల ద్వారా డిజిటల్ లావాదేవీలు జరుగుతాయి. ఇందుకు బ్యాంకింగ్‌ వ్యవస్థ అవసరం ఉంటుంది. ఆన్‌లైన్ లావాదేవీల కోసం కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతాలను UPIతో లింక్ చేయాలి. డిజిటల్‌ రూపాయికి బ్యాంకింగ్‌ వ్యవస్థ అవసరం లేదు. నేరుగా కేంద్ర బ్యాంకైన ఆర్బీఐతోనే లావాదేవీలు నిర్వహించొచ్చు.


CBDC ఉపయోగం ఏంటి?


ప్రపంచంలో భారత్‌ మాత్రమే డిజిటల్‌ కరెన్సీని రూపొందించడం లేదు. 90 శాతం సెంట్రల్ బ్యాంకులు CBDC పనిలో నిమగ్నమయ్యాయి. ఇందులో నాలుగో వంతు డిజిటల్‌ కరెన్సీని అభివృద్ధి చేస్తున్నాయి. మరికొన్ని ఇప్పటికే  పైలట్‌ ప్రాజెక్టును అమలు చేస్తున్నాయి. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ నిర్వహించిన సర్వేలో CBDCలని అభివృద్ధి చేస్తున్న సెంట్రల్ బ్యాంకుల సంఖ్య గతేడాది రెట్టింపైందని తెలిసింది.


 రెండేళ్లుగా క్రిప్టోకరెన్సీలు పెరిగాయి. ప్రజలు వీటిని లావాదేవీలకు ఉపయోగిస్తున్నారు. అందుకే స్టేబుల్‌ కాయిన్‌లను రూపొందించాలని భారత్‌ సహా ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. లీగల్‌ కరెన్సీకి భద్రత కల్పించాలని అనుకుంటున్నాయి. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ మార్కెట్ వల్ల కేంద్ర బ్యాంకులు అసౌకర్యానికి గురవుతున్నాయి. ఇవి చట్టబద్ధ కరెన్సీకి సవాళ్లు విసురుతున్నాయి. 


క్రిప్టోతో స్టేబుల్‌ కాయిన్‌లకు ముప్పు లేదు


రెండేళ్ల క్రితం వరకు స్టేబుల్‌ కాయిన్ల చెలామణీ అంతగా లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సీబీడీసీల అవసరం ఏర్పడింది. సాధారణ డిజిటల్‌ లావాదేవీలు వీటి లక్ష్యాలను నెరవేర్చలేవు. అందుకే సీబీడీసీల అవసరం ఏర్పడిందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌  టి రవి శంకర్ అన్నారు. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలు అస్థిరమైనవి కాబట్టి స్టేబుల్‌ కాయిన్‌లకు వాటితో ముప్పు లేదని ఆయన పేర్కొన్నారు. టెథర్, యూఎస్డీ కాయిన్‌కు బంగారం, అమెరికా డాలర్‌ విలువతో అనుసంధానించడం వల్ల వాటి విలువ స్థిరంగా ఉంటోంది. యూపీఐ ప్రవేశం తర్వాత డిజిటల్‌ లావాదేవీలకు ఆదరణ పెరిగింది. ఏటా 50 శాతం వృద్ధి కనిపిస్తోంది. అందుకే డిజిటల్‌ రూపాయి ఆవశ్యకత ఏర్పడింది.


CBDCతో కస్టమర్లకు ప్రయోజనం ఏంటి?


డిజిటల్‌ లావాదేవీల్లో UPI అత్యంత విజయవంతమైంది. అలాంటప్పుడు CBDC కస్టమర్లకు ఎలా ఉపయోగపడుతుందన్న ప్రశ్న వస్తుంది. UPI ఖచ్చితంగా అతిపెద్ద డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అనడంలో సందేహం లేదు. వినూత్న విధానం ద్వారా CBDC పోటీని పెంచుతుంది. ఇతర డిజిటల్‌ లావాదేవీల్లాగా అనిపించినా CBDC సెంట్రల్ బ్యాంకుతో ప్రత్యక్ష్య సంబంధం కలిగి ఉంటుంది. ఇది మరింత సురక్షితమైనది. బ్యాంక్ డిపాజిట్ల ద్వారా డబ్బును బదిలీ చేసేందుకు ఎలాంటి వాటిపై ఆధారపడదు. దేశంలోడిజిటల్‌ లావాదేవీలు పెరిగినా ఇప్పటికీ నగదునే ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు ఆర్బీఐ సర్వే 2018-19 తెలిపింది.  డిజిటల్‌ రూపాయి బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా రాదు కాబట్టి గోప్యతకు వీలుంటుంది. కరెన్సీ నోట్ల తగ్గించేందుకు ఆర్బీఐకి సాయం చేస్తుంది.


CBDCలతో ఇబ్బందులేంటి?


డిజిటల్‌ రూపాయి ఆవిష్కరణకు ముందు కొన్ని సమస్యలకు పరిష్కారాలు వెతకాల్సి ఉంది. నేరుగా ఆర్బీఐతోనే లావాదేవీలు జరుపుతారు కాబట్టి బ్యాంకింగ్‌ వ్యవస్థలతో పనుండదు. సీబీడీసీని వాలెట్లలో డిపాజిట్‌ చేస్తారు కాబట్టి బ్యాంకు డిపాజిట్లు తగ్గుతాయి. దాంతో వారు వ్యాపార సంస్థలకు రుణాలు ఇవ్వడం తగ్గిపోతుంది. బ్యాంకింగ్‌పై ప్రభావం చూపిస్తుంది. అయితే సీబీడీసీ నిర్వహణకు బ్యాంకులను మాధ్యమంగా తీసుకోవడంపై ఆలోచిస్తున్నామని ఆర్బీఐ చెబుతోంది. కొన్నిదేశాల వ్యవస్థలను పరిశీలిస్తున్నామని వెల్లడించింది.


బహామాస్ 2020లో సొంత CBDC అయిన సాండ్‌ డాలర్‌ను ప్రవేశపెట్టింది. 2021లో నైజీరియా (eNaira), తూర్పు కరేబియన్, చైనా CBDC పైలట్ వెర్షన్‌లను ప్రారంభించాయి. ఈ దేశాల్లో కేంద్ర బ్యాంకులు టైర్డ్-వాలెట్ విధానాన్ని అవలంబించాయి. అంటే తక్కువ-విలువ కలిగిన లావాదేవీలు గోప్యంగా ఉంటాయి. ఖచ్చితమైన KYC నిబంధనలు అవసరం లేదు. పరిమితిని మించితే లావాదేవీలను ట్రాక్ చేస్తారు. మనీలాండరింగ్‌, నల్లధనానికి చెక్‌ పెట్టేందుకు ఇలా చేస్తున్నారు.


మనదేశంలో డిజిటల్ రూపాయిని విడుదల చేసే ముందు RBI ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. దశలవారీగా పైలట్‌ ప్రాజెక్టులను ఆరంభించనుంది. బ్యాంకింగ్ వ్యవస్థ కోసం లేదా రెండు దేశాల మధ్య క్రాస్ కంట్రీ లావాదేవీల కోసం CBDCల వినియోగానికి ఆర్బీఐ అన్షేషణ చేపట్టింది. దీనిని హోల్‌సేల్ CBDC అని పిలుస్తారు. ఈ లావాదేవీలకు గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. క్రిప్టో కరెన్సీలపై నిషేధం మాదిరిగానే సీబీడీసీ విధానంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు.