Crypto Regulation: భారత్‌లో క్రిప్టో కరెన్సీ ఎందుకు అధికారికం కాదు..? అసలెప్పుడు అవుతుంది..? ప్రభుత్వం ఏం చెబుతోంది, ఆర్బీఐ ఎందుకు మోకాలడ్డుతోంది...? వీటన్నిటికీ కారణాలు ఇప్పటికే అందరికీ తెలుసు. అయితే భారత ప్రభుత్వం మాత్రం క్రిప్టో కరెన్సీపై సానుకూల ధోరణితో ఉన్నట్టే కనిపిస్తోంది. సమగ్ర అధ్యయనం తర్వాతే సరైన నిర్ణయం తీసుకోవాలని ఎదురు చూస్తోంది. భారత్ తీసుకోబోయే నిర్ణయం ఇతర దేశాలకూ దిక్సూచిలా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 


డీమ్యాట్ ఖాతాలకు సమానంగా క్రిప్టో ఖాతాలు.. 


దేశంలో క్రిప్టో అధికారికం కాకపోయినా ప్రజలు ఎప్పటినుంచో వాటిని ఆదరిస్తున్నారు. భారత్ లో 2.7 కోట్ల మంది వద్ద క్రిప్టో ఆస్తులు ఉన్నాయి. దేశంలోని యాక్టివ్ డీమ్యాట్ ఖాతాలకు దాదాపుగా ఇది సమానం. దీన్ని బట్టి భారతీయులు క్రిప్టోపై ఎంత ఆసక్తితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా టైర్-2, టైర్-3 పట్టణాలకు చెందిన వారు క్రిప్టో ఖాతాలు కలిగి ఉన్నారు. బిట్ కాయిన్లతో బిజినెస్ చేస్తున్నారు. 


క్రిప్టో క‌రెన్సీ ప‌ట్ల వ్యాపారులు, వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని 2013 నుంచి ఆర్బీఐ హెచ్చరిస్తూనే ఉంది. భారత్ లో వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ లావాదేవీల‌ను నిషేధిస్తూ 2018 లో ఆర్బీఐ ఓ స‌ర్కులర్  జారీ చేసింది. అయితే 2020లో ఆర్బీఐ సర్కులర్ ని సుప్రీంకోర్టు పక్కనపెట్టడంతో క్రిప్టో కరెన్సీలపై భారతీయులు దృష్టిసారించారు. ప్రభుత్వం కూడా వాటి విషయంలో సీరియస్ గా ఆలోచిస్తోంది. 


భారత్ లాంటి పెద్ద దేశాల్లో.. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్‌ లు భద్రత విషయంలో ప్రజలకు మానసిక ప్రశాంతత ఇస్తాయి. అలాంటి ప్రశాంతత కోసమే క్రిప్టోల విషయంలో భారత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. మరోవైపు ఆర్బీఐ పదే పదే వాటిపై నిషేధం విధించాలని కోరుతోంది. గతంలో కూడా మ్యూచువల్ ఫండ్స్ విషయంలో ఇలాంటి అపోహలే ఉన్నా.. ఆ తర్వాత వాటిని భారతీయులు ఎంతగా ఆదరిస్తున్నారో అందరికీ తెలిసిందే. 


క్రిప్టోపై భారత్ వైఖరి ఏంటి..?


డిజిటల్ రూపాయిని ప్రవేశ పెట్టేందుకు గత బడ్జెట్ సెషన్లో కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలపడంతో భారత్ లో క్రిప్టో ప్రవేశం ఎంతో దూరంలో లేదని అనుకున్నారు. కేంద్రం వెనకడుకు వేయడంతో అది మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. కానీ డిజిటల్ రూపాయిపై భారత్ ఆసక్తి స్వాగతించదగిన విషయం. బ్లాక్ చెయిన్ నియంత్రణలో ఉన్న బిట్ కాయిన్లు కూడా డిజిటల్ రూపాయిల లాంటివే. అంటే భారత్ కూడా కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోడానికి సిద్ధంగా ఉంది కానీ, సేఫ్ గేమ్ ఆడాలని చూస్తోంది. 


క్రిప్టోని గుర్తించే విషయంలో భారత్ దానిపై పన్ను విధిస్తే కచ్చితంగా అప్పుడు దాని ఉనికిని గుర్తించినట్టే. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మున్ముందు ఈ పన్నుల భారం క్రిప్టోని ప్రోత్సహించేలా ఉండాల్సిందే. ఇక వాస్తవ కరెన్సీకి, క్రిప్టో కరెన్సీకి మధ్య ఉన్న తారతమ్యాన్ని కొనసాగిస్తూనే.. ఆ రెండిటి విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంటే భారత్ లో క్రిప్టోలకు ఆదరణ పెరుగుతుంది. ప్రస్తుతం ఇతర దేశాల్లో క్రిప్టో కదలికలను భారత్ ఆసక్తిగా గమనిస్తోంది. క్రిప్టో క‌రెన్సీలు స‌రిహ‌ద్దులు లేనివ‌ని, వాటిపై నియంత్రణ, మధ్య వర్తిత్వాన్ని  నివారించ‌డానికి అంతర్జాతీయ స‌హ‌కారం అవ‌స‌రమని ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. క్రిప్టో విషయంలో సింగపూర్, దుబాయ్ సరైన నిర్ణయాలు తీసుకుని, సక్రమంగా ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నాయి. అంతకంటే ఎక్కువగా భారత్ ఆలోచించాల్సిన అవసరం లేదు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో నడిచే క్రిప్టో కరెన్సీలకోసం భారత ప్రభుత్వం లైసెన్స్ లు జారీ చేస్తూనే ఓ ఫ్రేమ్ వర్క్ రూపొందించాల్సి ఉంటుంది. 


సాఫ్ట్ వేర్ విషయంలో భారత ప్రభుత్వం సేవలను అందించే దేశంగా కాకుండా.. రూపకర్తలను అందించే దేశంగా దూసుకెళ్తోంది. క్రిప్టో విషయంలో కూడా భారత్ సేవలు అందుకునే విషయంలో కాస్త వెనకపడినా భవిష్యత్తులో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపై క్రిప్టో భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. క్రిప్టో విషయంలో ఇప్పటి వరకు వివిధ దేశాలనుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు సక్రమంగానే ఉండగా, మరి కొన్ని దేశాలు తీసుకునే నిర్ణయాల వల్ల క్రిప్టో యూజర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఉదాహరణకు చైనా వ్యాపారులు క్రిప్టో వాడకం కోసం ఇతర దేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే భారత్ అనుసరిస్తున్న వ్యూహాలను మరికొన్ని దేశాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. భారత్ నిర్ణయాన్ని బట్టే ఆయా దేశాలు క్రిప్టోను నిషేధించాలా, లేక స్వాగతించాలా అనే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటాయి.